బిల్లులందు పురుష బిల్లులు వేరయా!
posted on Dec 12, 2025 2:33PM

జాతీయ మహిళా కమిషన్ గురించి మనం వినే ఉంటాం. అలాంటిదిపుడు జాతీయ పురుష కమిషన్ ఏర్పాటుకు రంగం సిద్దం చేస్తున్నారు. డిసెంబర్ 6న రాజ్యసభలో ఒక బిల్లు ప్రవేశ పెట్టారు. ఈ బిల్లు ఉద్దేశం ఏంటంటే పురుషుల హక్కుల సంరక్షణ, వారి సంక్షేమం వంటి విషయాల్లో ఈ బిల్లు వారికి ఎంతగానో ఉప యోగపడుతుంది.
ఇంతకీ పురుషుల హక్కులు అంటూ ఏవీ ఇప్పటి వరకూ లేవు. మానవ హక్కులే పురుషుల హక్కుల కిందకు వస్తాయి. బస్సుల్లో మహిళలకు మాత్రమే కేటాయించేలాంటి సీట్లు పురుషులకంటూ ఉండవు. ఇ ఇక రిజర్వేషన్లలో ఓసీకంటూ ప్రత్యేకించీ రిజర్వేషన్లుండవు. ఎకనామికల్లీ బ్యాక్ వర్డ్ క్లాస్ ఎలాగో ఇది కూడా అలాంటిదేనని చెప్పాల్సి వస్తుంది.
అయితే, ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం మూడు రకాల జండర్లు తయారై కూర్చున్నాయి. ఒకప్పుడు ఆడ మగ మాత్రమే ఉండేవారు. ఇప్పుడు థర్డ్ జండర్ ఒకటి తయారైంది. ఇక పురుషుడు అంటే ఎవరు? అతడ్ని ఎలాంటి గుణగణాల కొద్దీ డిసైడ్ చేస్తారు? అన్నది కూడా చర్చనీయంశమే. ఈ విషయాలపై ఈ బిల్లు ద్వారా ఒక క్లారిటీ రావల్సి ఉంది. పురుషత్వం అంటే ఏమిటి? అన్నది కూడా ఒక డిబేటబుల్ పాయింటే. ఇటీవలి కాలంలో పుంసత్వ స్థాయిలు విపరీతంగా పడిపోతూ వస్తున్నాయని చెబుతున్నాయి కొన్ని గణాంకాలు.
దానికి తోడు రాన్రాను ఫిమేల్ డామినేషన్ పెరిగి మేల్ ఢమాల్ అంటున్న పరిస్థితి కూడా ఉంది. సహజీవనాలు పెరుగుతున్న ఈ కాలంలో, ఎల్జీబీటీ కి హై ప్రయారిటీ ఇస్తోన్న ఈ సందర్భంలో.. పురుషుల హక్కులు ప్రశ్నార్ధకమే. ప్రస్తుత యువతరం మాట అటుంచితే.. వీరి తండ్రుల తరంలో చాలా మంది భార్యా బాధితులున్నారు. వీరిపైన రివర్స్ లో గృహహింస వంటి తప్పుడు కేసులు పెడుతుంటారు. ఇలాంటి వాటిలో పురుష కమిషనన్ రక్షణ కల్పిస్తుందేమో చూడాలి.
ఆపై గత ఐదేళ్ల కాలంలో ఐదు రాష్ట్రాల్లో 785 మంది భర్తలు తమ తమ భార్యల చేతిలో హతమయ్యారు. అది కూడా వారి వారి ప్రియుల సాయంతో ఆయా భార్యామణులు తమ తమ భర్తలను చంపేసిన ఘటనలు ఇటీవలి కాలంలో బాగా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో పురుష కమిషన్ ఏదైనా పురుషులకు రక్షణ కల్పించ గలదా? అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా పురుషాధిక్య ప్రపంచంగా పిలిచే ఈ సమాజంలో పురుషుల హక్కులకే రక్షణ లేకుండా పోవడం కూడా తీవ్ర విషాదకరం. చర్చనీయాంశం కూడా.