వైభవంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
posted on Sep 24, 2025 5:46PM

తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక వైభవంతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కళ్యాణవేదికలో టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుష్పప్రదర్శనశాల మరియు ఫోటో ఎగ్జిబిషన్‌ను చైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. పుష్పాలంకరణలు, శిల్పకళా ప్రదర్శనలు దర్శనార్థులకు అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ప్రతి విభాగం ఒక ప్రత్యేక కళాఖండంలా అలరించింది.
అలాగే తిరుమలలో మీడియా సెంటర్‌ను ప్రారంభించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మీడియా పాత్ర బ్రహ్మోత్సవాల విజయానికి కీలకమని నాయుడు పేర్కొన్నారు. చిన్న చిన్న లోపాలు సహజమని, వాటిని పెద్దవిగా చూపించకుండా, సానుకూల దృక్పథంతో ఉత్సవాల వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని సూచించారు.
ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే టీటీడీ యంత్రాంగం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. ఉత్సవాల విజయానికి మీడియా పూర్తి స్థాయి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. తిరుమలలో ఈ బ్రహ్మోత్సవాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తుతున్నాయి.