టీజీఎస్ఆర్టీసీలో ఏఐ వినియోగం

దేశంలోనే  తొలి సారిగా తెలంగాణ ఆర్టీసీ ఏఐ సేవలను వినియోగించుకోనుంది. అత్యాధునిక పరిజ్ణానాన్ని అందిపుచ్చుకుని సేవలను మెరుగుపరుచుకునే దిశగా ఆర్టీసీ ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే  ఇప్పటికే  అన్ని రంగాలను ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్ ను విస్తృతంగా వినియోగించుకోవాలని టీజీ ఆర్టీసీ నిర్ణ‌యించింది.  ఉత్పాదకత పెంపు, సిబ్బంది ప‌నితీరు, ఆరోగ్య స్థితి ప‌ర్య‌వేక్షణ‌, ఖర్చుల తగ్గింపు, ర‌ద్దీకి అనుగుణంగా స‌ర్వీసుల‌ ఏర్పాటుతో పాటు సేవలను మరింతగా ప్రజలకు చేరువ చేయాలన్న లక్ష్యంతో ఏఐ వినియోగం దిశగా అడుగు వేసింది. దీంతో   దేశంలోనే తొలిసారిగా ఏఐ వినియోగాన్ని చేపట్టిన ప్ర‌జా ర‌వాణా సంస్థ‌గా టీజీఎస్ ఆర్టీసీరికార్డు సాధించింది. 

ఏఐ ప్రాజెక్టు అమలుకు హన్స ఈక్విటీ పార్టనర్స్ ఎల్ఎల్‌పీ అనే సంస్థ టీజీఎస్ఆర్టీసీకి తోడ్పాటును అందిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం, ప్రణాళికాబద్ధమైన అమలు వ్యూహాలను అందించి, అన్ని డిపోల్లో సులభంగా అమలు జరిగేలా ఆ సంస్థ సహకరిస్తుంది. తెలంగాణ ఆర్టీసీలో ఏఐ వినియోగం కోసం ఒక ప్రత్యేక టీమ్ ను సంస్థ యాజమాన్యం ఏర్పాటు చేసింది. టెక్నాలజీపై ఆసక్తి, అవగాహన ఉన్న అధికారులకు ఆ బృందంలో ప్రాధాన్యతను ఇచ్చింది ఏఐ వినియోగంపై ఆ బృందానికి  హన్స ఈక్విటీ పార్ట్‌న‌ర్స్ శిక్ష‌ణ ఇస్తోంది. 

ఏఐ ప్రాజెక్టులో భాగంగా మొద‌ట‌గా 40 వేల మంది సిబ్బంది ఆరోగ్య స్థితిని ప‌ర్య‌వేక్షిస్తున్నారు. గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ లో భాగంగా ఉద్యోగుల‌కు చేసిన వైద్య ప‌రీక్ష‌ల ఆధారంగా ఆరోగ్య ప‌రిస్థితిని ఏఐ, మెషిన్ లెర్నింగ్ స‌హ‌కారంతో అంచ‌నా వేస్తున్నారు. మొద‌ట పైల‌ట్ ప్రాజెక్ట్‌గా ఆరు డిపోల్లో దీనిని అమలు చేసి చూశారు. సత్ఫలితాలు రావడంతో ఇప్పుడు దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలోనూ అమలు చేస్తున్నారు.  త్వ‌ర‌లోనే ఏఐ ద్వారా ఆటోమెటిక్ షెడ్యూలింగ్‌కు టీజీఆర్టీసీ ప్రణాళికలు రూపొందిస్తున్నది. అలాగే.. పండుగులు, సెలవు దినాలలో ప్రయాణీకుల రద్దీని ఏఐ స‌హ‌కారంతో  అంచ‌నా వేసి.. ఆ మేర‌కు బ‌స్సుల‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 

కాగా టీజీఎస్ఆర్టీసీలో ఏఐ ప్రాజెక్ట్ అమ‌లుపై  డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ సచివాల‌యంలో  ఇటీవ‌ల ర‌వాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ కు  పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంస్థ ఉన్నతాధికారులు వివరించారు. ఈ కార్య‌క్ర‌మంలో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, టీజీఎస్ఆర్టీసీ ఎండీ   సజ్జనర్, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆధునిక రవాణా అవసరాలకు అనుగుణంగా, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు సంస్థను ఆర్థికంగా, సాంకేతికంగా బలోపేతం చేయడం కోసం 2021 నుంచే అమలు చేస్తున్న స్ట్రాటజిక్ డిప్లాయ్‌మెంట్ ప్లాన్  కీలక పాత్ర పోషిస్తున్నదని మంత్రి  ఆర్టీసీ ఉన్నతాధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ కు తెలిపారు.  

ఈ సంస్థర్భంగా తెలంగాణ ఆర్టీసీ పని తీరు మెరుగుపరుచుకునే లక్ష్యంతో ఏఐని వినియోగించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్.. ప్రపంచంలో ఏఐ ప్రభావితం చేయని రంగమే లేదన్నారు.  ఏఐ ప్రాజెక్ట్ అమ‌లుకు సమష్టిగా ప‌నిచేసి.. ఆర్టీసీ మరింత అభివృద్ధి సాధించేలా అధికారులందరూ కృషి చేయాలని సూచించారు. ఏఐ ప్రాజెక్ట్ రూపకల్పనలో విశేషంగా తోడ్పడిన హన్స ఈక్విటీ పార్ట్నర్స్ ఎల్ఎల్‌పీకి చెందిన త్రినాధబాబు, సునీల్ రేగుళ్లను మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రత్యేకంగా అభినందించి, సన్మానించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu