గొడవలు మళ్లీ సిద్థం..చంద్రుల బంధానికి బీటలు వారబోతున్నాయా..?

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు కనువిందు చేసిన తెలుగు ముఖ్యమంత్రుల మైత్రి బంధానికి మళ్లీ బీటలు వారే సూచనలు కనిపిస్తున్నాయి. అమరావతి వేదికగా వికసించిన చంద్రుల స్నేహం వీగిపోయే అవకాశముందా? చంద్రబాబు, కేసీఆర్ మళ్లీ ఎత్తుకు పైఎత్తులతో కత్తులు దూసుకోబోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.  ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం విజయవాడలో వాడి వేడిగా సాగింది. ఈ భేటీలో మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న ప్రాజెక్ట్‌లపై కేంద్రానికి లేఖ రాయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అవసరమైతే తెలంగాణ చేపడుతోన్న ప్రాజెక్ట్‌లపై సుప్రీంకోర్టుకి వెళ్లాలని నిర్ణయించింది.

 

తెలంగాణపై న్యాయపోరాటం అంటే అది కేసీఆర్‌పై పోరాటమే అంటే చంద్రబాబు మళ్లీ కేసీఆర్‌తో కత్తులు దూయడానికి రెడీ అయినట్టే. అమరావతి శంకుస్థాపన మొదలు ఇప్పటి వరకు చంద్రబాబు సంయమనంగానే ఉంటున్నారు. ఎక్కడా కేసీఆర్‌ను పల్లెత్తు మాట అనడం లేదు. కేసీఆర్ కూడా గతంలో మాదిరిగా బాబుపైన ఘాటు వ్యాఖ్యలు చేయడం లేదు. బాబు ఆహ్వానాన్ని మన్నించి అమరావతి శంకుస్థాపనకు విచ్చేసిన కేసీఆర్ చాలా హుందాగా వ్యవహరించారు. అటు పిమ్మట తాను తలపెట్టిన ఆయుత చండీయాగానికి స్వయంగా వెళ్లి చంద్రబాబును ఆహ్వానించారు కేసీఆర్. చంద్రబాబు తన సహచరులతో కలిసి ఆయుత చండీయాగానికి హాజరై పెద్దిరికాన్ని నిలుపుకున్నారు. అలా అప్పటి నుంచి తరచూ ఎక్కడో ఒక చోట కలుస్తూ రెండు రాష్ట్రాల్లో సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పారు ఇద్దరు చంద్రులు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల్ని కూడా చర్చించుకుందామంటూ కేసీఆర్ భద్రాద్రి రామయ్య సాక్షిగా ప్రకటించారు.

 

ఇలాంటి సమయంలోనే తెలంగాణలో ప్రాజెక్టుల్ని కట్టడానికి గులాబీ బాస్ రెడీ అవుతున్నారు. ఆంధ్రా ప్రయోజనాల్ని దెబ్బతీసే ఈ ప్రాజెక్ట్‌లను చంద్రబాబు ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. దానికి తోడు న్యాయపోరాటానికి సైతం సిద్ధమవ్వడంతో మళ్లీ రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ అగ్గిరాజుకున్నట్లే.  ఎవరి రాష్ట్రం కోసం వారు కోట్లాడుకోవడానికి బరిలోకి దిగుతుండటంతో ఇంతకాలం సొంత సోదరుల్లాగా మెలిగిన కేసీఆర్, చంద్రబాబులు మళ్లీ ప్రత్యర్థులుగా మారబోతున్నారన్న మాట. ఇప్పటికే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేయడంతో రణరంగంలోకి దిగినట్లుగానే భావించాలి. చంద్రబాబు ఏం చేసినా కేసీఆర్ కాళేశ్వరం విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు.  దీనిని బట్టి తిట్ల దండకాలు..విమర్శలు..ప్రతి విమర్శలు త్వరలో తెలుగు రాష్ట్రాలను ఊపేయబోతున్నాయి. మళ్లీ ఓటుకు నోట్లు..ఫోన్ ట్యాపింగ్‌లు బయటకు వచ్చినా రావచ్చు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu