దేవతలారా దీవించండి!

ఈ మధ్య కాలంలో   దేవతలు దీవించడానికి బదులు శపిస్తున్నారా?  అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  దేవుళ్లకు సంబంధించిన అంశాల్లో   చిన్న వివాదం కూడా అతి పెద్ద రాద్ధాంతంగా మారిపోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దిగ్గజ దర్శకుడు రాజమౌళి.. ఇలా వారు యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వెనుక కూడా దైవ ధిక్కారం, దైవ దూషణ ఉందన్న ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తి పెద్ద వివాదంగా మారిపోతున్న పరిస్థితి. 

బేసిగ్గా రేవంత్ రెడ్డికి ఆంజనేయస్వామివారంటే చాలాచాలా భక్తి. ఆయన సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో ఒక పురాతన ఆంజనేయస్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయంలో పూజ చేసి మరీ తన నామినేషన్  వేయడం ఆయనకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు, ఆచారం.  ఇప్పటికీ ఆ సెంటిమెంటు కొనసాగుతూనే ఉంది. అలాంటి రేవంత్ రెడ్డి పొరబాటున వివిధ విభాగాల అధిదేవతలైన హిందూ దేవతలకూ, కాంగ్రెస్ లోని మల్టిపుల్ లీడర్షిప్ కి  పోలిక తెస్తూ వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మచారులకు, పెళ్లయిన వారికి, ఇద్దరు భార్యలు కలవారికీ.. ఇలా హిందూ సంప్రదాయంలో  దేవుళ్లు ఉన్నారని రేవంత్ అన్నారు. ఈ వ్యాఖ్యలు పెద్ద వివాదానికి తెరలేపాయి. ముఖ్యంగా హిందూ వాదులు బీజేపీ లీడర్లు రేవంత్ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పిస్తున్నారు. 

 ఇలా ఈ ఒక్క అంశం మాత్రమే కాదు పలు అంశాల్లో  కాషాయవాదులు, కమలనాథులు  పెద్ద ఎత్తున తీవ్ర నిరసనలు, అభ్యంతరాలు తెలియ చేస్తున్నారు. ఇంతకు ముందు శివజ్యోతి అనే  యాంకర్ వెంకన్న సన్నిథిలో తాము రిచ్చెస్ట్ బిచ్చగాళ్లమంటూ చేసిన వ్యాఖ్యలతో భారీ స్థాయిలో ట్రోలింగ్ కి గురయ్యారామె.

ఇక ఒక స్వామి మాల వేసిన ఎస్సై వివాదం సంగతి సరే సరి. ఈ విషయంపై బీజేవైఎం నాయకులు ఏకంగా డీజీపీ ఆఫీసునే ముట్టడించి నానా యాగీ చేశారు. డిపార్టుమెంటుగానీ ఆయనకిచ్చిన మెమో వెనక్కు తీస్కోకుంటే మా తడాఖా చూస్తారంటూ హెచ్చరికలు జారీ చేశారు. 

అలాగే దర్శక ధీరుడు రాజమౌళి  తనకు దేవుడిపై నమ్మకాలు లేవని అనడం కూడా పెద్ద రాద్ధాంతమై  కూర్చుకుంది. మాధవీ లత, చికోటి ప్రవీణ్ తో సహా అందరూ రాజమౌళిపై విరుచుకుపడిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. రాజమౌళిపై విరుచుకు పడ్డ వారి లిస్టు కొండవీటి చాంతాడంత.

దీన్ని బట్టి చూస్తుంటే.. ఈ దేవీ దేవతలకు మరీ ఇంత సెక్యూరిటీయా? ఈగ వాలనీయడం లేదెవరూ? అనిపించకమానదు. సీఎం రేవంత్  హిందూ. గతంలో ఆయన ఏబీవీపీ కార్యకర్త. ఆర్ఎస్ఎస్ భావజాలం తెలియని వారు కాదు. అలాంటి రేవంత్ ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉండి సీఎం అయ్యారని చెప్పి ఆయనేమీ హిందూ కాకుండా పోరు. ఒక ఇన్ స్పిరేషన్ కోసం పోలిక తెచ్చి జనానికి అవగాహన పెంచడానికి అన్నమాటలను పట్టుకుని దానిని వివాదాస్పదం చేయడం ఎంత వరకూ సమంజసం అని పరిశీలకులు అంటున్నారు.  అదే విధంగా దేవుడిపై నమ్మకం ఉండటం, ఉండకపోవడం అన్నది ఎవరికి వారికి వ్యక్తిగత విషయం. దూషణ లేనంత వరకూ అటువంటి విషయాలను వివాదం చేయడం తగదంటున్నారు.

ఇలా వివాదాలు సృష్టిస్తున్నవారు హేతు వాదాన్ని, హేతువాదులనూ బతకనిచ్చేలా లేరన్న మాట కూడా వినిపిస్తుంది. తెలుగువారు గర్వించదగ్గ నటులలో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు పలు సందర్భాలలో తనకు దేవుడిపై భక్తి లేదని ప్రకటించారు. అటువంటి ఆయన అద్భుతమైన భక్తిరస చిత్రాలలో అత్యద్భుతంగా నటించి మెప్పించారు. అందుకే రేవంత్ కానీ, రాజమౌళి కానీ చేసిన వ్యాఖ్యలపై అనవసర రాద్ధాంతం చేయడం సమజసం కాదంటున్నారు పరిశీలకులు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu