పారికర్‌ను మోడీ మళ్లీ సీఎం చేస్తారా..?
posted on May 3, 2016 3:16PM

మనోహర్ పారికర్..కేంద్ర రక్షణ శాఖ మంత్రి. బీజేపీ అధినాయకత్వానికి నమ్మిన బంటుగా ఉంటూ గోవాలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి ముఖ్యమంత్రిగా నిలిచిన వ్యక్తి. ఆయన సమర్థత కారణంగా ప్రధాని నరేంద్రమోడీ ఏరికోరి గోవా సీఎం పదవికి రాజీనామా చేయించి మరీ తన కేబినెట్‌లో చేర్చుకుని రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలను అప్పగించారు. ఆయన వచ్చి రావడంతోనే దేశ రక్షణ రంగానికి ఉత్తేజాన్ని నింపారు. రక్షణ రంగ ప్రణాళికలు, కొత్త ఆయుధాల కొనుగోలు ఇలా ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న వాటికి మోక్షం కలిగించి రక్షణ శాఖ బలాన్ని పెంచుతున్నారు. అయితే ఏమైందో, ఏమో తెలియదు గాని..మోడీ కేబినెట్ నుంచి పారికర్ బయటకు వచ్చేస్తున్నారంటూ జాతీయ మీడియాలో ప్రచారం ఊపందుకుంది.
ఇది నిజంగా నిజమేనా ? రక్షణ మంత్రిగా పక్కకు తప్పకుని తిరిగి గోవా ముఖ్యమంత్రిగా పారికర్ పదవీ బాధ్యతలు చేపడతారని అటు సొంత రాష్ట్రంలో కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిని పారికర్ ఖండించకపోగా మొన్న గోవాలో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మూడు నాలుగు నెలల్లో గోవాకు తిరిగి వచ్చేస్తున్నాను అంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి టైమ్‌లో ఆయన సెంట్రల్‌ను వదిలి స్టేట్‌పై కాన్‌సన్‌ట్రేషన్ చేయడానికి కారణమేంటి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో గోవా కూడా ఒకటి గత ఎన్నికల్లో ఒంటిచేత్తో విజయం సాధించిన బీజేపీకి ఈ సారి గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందింది. దానికి తోడు ప్రస్తుత సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ పనితీరు ఏమంత ఆశాజనకంగా లేదు. ఆయన పరిపాలన ఇలాగే కొనసాగితే ప్రజల ముందుకెళ్లడం కష్టం. ఈ విషయాన్ని గమనించిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా , పారికర్ ఒక్కరే దీనిని హ్యాండిల్ చేయగలరని డిసైడ్ అయ్యారు. అందుకే కేంద్రమంత్రిగా ఆయన చేత రాజీనామా చేయించి గోవా సీఎంగా తిరిగి బాధ్యతలు చేపట్టేలా పావులు కదుపుతున్నారు. పారికర్‌కు గోవాలో ఉన్న ఛరిష్మా, పరిపాలనా దక్షతతో 2017 ఎన్నికల్లో తమకు విజయం దక్కేలా చేస్తుందని అమిత్ షా అండ్ కో నమ్ముతున్నారు. పారికర్ ప్రెస్ మీట్‌ను బట్టి ఇప్పటికే దీనికి సంబంధించిన ఆదేశాలు ఆయనకు అంది ఉండాలి అందుకే తాను మూడు నెలల్లో గోవాకు వస్తానంటూ మీడియాకు చెప్పగలిగారు.