మోడీ దౌత్య రీతి.. ట్రంప్ ఉక్కిరి బిక్కిరి!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత పర్యటన నిస్సందేహంగా మోడీ దౌత్య విజయంలో ఒకటిగా చెప్పవచ్చు. రష్యా అధ్యక్షుడి భారత పర్యటన అనగానే ఉక్రోషంతోనో, ఆందోళన వల్లో తెలియదు కానీ.. అమెరికా అధ్యక్షుడు కంగారు పడుతున్నారు.  పుతిన్ భారత పర్యటన ఈ సమయంలో అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అగ్రరాజ్యం అమెరికా ఆగకుండా చేస్తున్న హెచ్చరికలు, విధిస్తున్న ఆంక్షలు, ఆరంభించిన టాక్స్ వార్ ను కూడా లెక్క చేయకుండా మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం రష్యాతో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా వేస్తున్న అడుగులు అమెరికా అధ్యక్షుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 

రష్యా నుంచి భారత్‌  తన అభీష్ఠానికీ, ఆదేశాలకూ విరుద్ధంగా చమురు దిగుమతి చేసుకుంటున్నదన్న ఒకే ఒక్క కారణంతో ట్రంప్ భారత్ పై టాక్స్ వార్.. సుంకాల యుద్ధానికి దిగారు. అయితే అది బూమరాంగ్ అయ్యింది.   భారతీయులను అమెరికాకు రాకుండా చేసేందుకు వీసా నిబంధనలు కఠినతరం చేశారు. భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని కంపెనీలను ఆదేశించారు. వీసా ఫీజును భారీగా పెంచారు. ఇవేవీ సత్ఫలితాలు ఇవ్వలేదు సరికదా.. అమెరికా పెద్దన్న పాత్రకే ఎసరు పెట్టేలా మారాయి. రష్యా, చైనాలతో భారత దోస్తీ గట్టిపడింది.    

పుతిన్‌ భారత పర్యటనలో భాగంగా  కుదిరే అవకాశం ఉన్న ఒప్పందాల కారణంగా అమెరికా మరిన్ని ఆర్థిక చిక్కుల్లో పడే అవాకశం ఉంది.   ట్రంప్‌ రష్యా చమురు దిగుమతిని ఆపమని భారత్ ను ఆదేశిస్తే.. అది కొనసాగిస్తూనే ఇప్పుడు తాజాగా రష్యాతో  ఆయుధ కొనుగోళ్లఒప్పందానికి రెడీ అయ్యింది.   ఇది కచ్చితంగా అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేయడంగానే భావించాల్సి ఉంటుంది. దీనికి ప్రతిగా మళ్లీ సుంకాలతో, విసాలపై మరిన్ని కఠిన ఆంక్షలతో ట్రంప్ విరుచుకుపడే అవకాశం ఉంది. అయితే వాటిని లెక్కచేయడానికీ, అమెరికా హెచ్చరికలు, ఆంక్షలకుభయపడే పరిస్థితి నుంచి భారత్ ఎప్పుడో బయటపడింది. ఇదంతా మోడీ దౌత్య  విధానాల కారణంగానే సాధ్యమైందన్నది అంతర్జాతీయ సమాజం చెబుతున్నమాట. 

మొత్తంగా ట్రంప్ అరాచక, అహేతుక విధానాలనుంచి భారత్ ను బయటపడేయడమే కాకుండా.. ఏక ధృవ ప్రపంచం అన్న భ్రాంతి నుంచి ట్రంప్ బయటపడక తప్పని పరిస్థితిని క్రియోట్ చేసే దిశగా ప్రధాని మోడీ దౌత్యపరంగా ముందుకు సాగుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu