భూమా, శిల్పాలకు దోస్తీ కుదిరేనా..?

కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో కీలకనేతలు భూమా నాగిరెడ్డి, శిల్పామోహన్ రెడ్డిల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుకు తెరదించడానికి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నడుం బిగించారు. జిల్లాలో పార్టీ బలోపేతంపై చర్చించేందుకు విజయవాడ రావాల్సిందిగా ముఖ్యమంత్రి వీరిద్దరిని ఆదేశించారు.  భూమా నాగిరెడ్డి, శిల్పామోహన్ రెడ్డి వర్గాల మధ్య ఉన్న వైరం ఈనాటిది కాదు. జిల్లాపై ఆధిపత్యం కోసం వీరిద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన జరగడం..మారిన రాజకీయ పరిస్థితుల రీత్యా అప్పటి వరకు కాంగ్రెస్‌లో ఉండి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన శిల్పామోహన్ రెడ్డి హస్తానికి గుడ్‌భై చెప్పి సోదరుడితో కలిసి సైకిలెక్కారు. చంద్రబాబు కూడా జిల్లా టీడీపీ పగ్గాలు శిల్పా బ్రదర్స్ చేతుల్లో పెట్టి సముచితంగా గౌరవించారు.

 

అటు భూమా నాగిరెడ్డి తన కుటుంబంతో సహా వైఎస్సార్‌సీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో భూమా కుమార్తె అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది. ప్రత్యర్థులైన భూమా, శిల్పాలు నంద్యాలలో తలపడ్డారు. ఇక్కడ విజయం భూమాదే. విజయం నాగిరెడ్డిది అయినప్పటికి తెలుగుదేశం అధికారంలోకి రావడంతో శిల్పా జిల్లాపై పట్టుసాధించారు. నంద్యాలలోనూ శిల్పా మాటే శాసనం. ఈ పరిస్థితుల్లో భూమా తన కూతురుతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. భూమా టీడీపీలోకి వస్తే తన పట్టు పొతుందని గ్రహించిన శిల్పా వీరి రాకను వ్యతిరేకించారు. అయితే పార్టీ కోసం, అధినేత కోసం శిల్పా అయిష్టంగానే భూమా రాకను స్వాగతించారు.

 

అయితే భూమా వచ్చిన కొద్దిరోజులకే శిల్పా ప్రధాన అనుచరుడు తులసీరెడ్డిపై దాడి జరుగింది..దీనికి భూమానే కారణమంటూ ఏకంగా అధినేతకే ఫిర్యాదు చేశారు శిల్పా మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో జిల్లాని తన గ్రిప్‌లో పెట్టుకోవడానికి భూమా పావులు కదిపారు. తన చాతుర్యంతో కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా టీడీపీలో చేరుస్తున్నారు. రోజు రోజుకు నాగిరెడ్డి స్ట్రాంగ్ కావడం శిల్పా సోదరులను ఆందోళనకు గురి చేసింది. రేపు మంత్రి పదవి వస్తే భూమా హవా జిల్లా అంతటా కొనసాగే అవకాశముందని ఎలగైనా నాగిరెడ్డి స్పీడుకు బ్రేక్ వేయాలని వీరు భావిస్తున్నారు.

 

ఇక వీరిద్దరూ కలవడం అసాధ్యమని..కర్నూలు జిల్లాలో రాజకీయ యుద్ధం తప్పదని అనుకుంటున్న సమయంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరే సందర్భంలో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది.  ప్రత్యర్థులిద్దరూ పాత గొడవలు పక్కన పెట్టి మాటమాట కలిపారు. ఈ దృశ్యాన్ని చూసిన తెలుగు తమ్ముళ్లు గెంతులు వేశారు. వీరిద్దరూ ఇలాగే ఉంటే ఎంత బావుండో అనుకున్నారు. ఇలాంటి ఛాన్స్ కోసమే ఎదురుచూస్తున్న చంద్రబాబు తమ్ముళ్ల  కలను నిజం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరీ అధినేత ఆదేశాలను భూమా, శిల్పాలు పాటిస్తారా? లేక బాబు వద్ద కూడా వాదులాడుకుంటారో అన్నది త్వరలోనే తేలిపోనుంది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu