కేసీఆర్ భోజనాలు.. జగన్ గాలి తిరుగుళ్లు.. ప్రజాధనం దుబారాలో ఇద్దరూ ఇద్దరే!

ప్రజాధనాన్ని తమ సొంతానికి దుబారా చేయడంలో తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు రికార్డులన్నీ తిరగరాసేశారని అంటున్నారు పరిశీలకులు. అలా అనడానికి కారణం ఇటీవల ఆర్టీఐ ద్వారా వారు పెట్టిన ఖర్చులు వెలుగులోకి రావడమే. ముందుగా తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు విషయానికి వస్తే.. ఆయన అధికారంలో ఉన్న తొమ్మిదేళ్ల కాలంలో అంటే 2014 నుంచి 2023 వరకూ  ప్రగతి భవన్ లో భోజనాలు, తినుబండారాల కోసం చేసిన ఖర్చు వెయ్యి కోట్లు. ఔను అక్షరాలా వెయ్యి కోట్లు. ఇది ఏదో కాకిలెక్క కాదు. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం. కేసీఆర్ హయాంలో ప్రగతి భవన్ లో నిత్య సంతర్పణ అన్నట్లుగా ఉండేది పరిస్థితి అని దీని ద్వారా తెలుస్తోంది. నిత్యం మటన్, చికెన్, కౌజు పిట్టలు, కుందేలు మాంసం కూరలతో పాటు కోడి గుడ్లతో వైరైటీ వంటలతో విందులు చేసుకున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇక  విదేశాల నుంచి ప్రత్యేకంగా తెప్పించుకున్న ఖరీదైన స్కాచ్ విస్కీ బాటిళ్లు కూడా ఇందులోకే వస్తాయి.

విషయానికి వస్తే ప్రగతి భవన్ లో కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు నిత్యం దాదాపు 50 మంది నిత్యం ఈ విందు భోజనాలకు హాజరయ్యేవారట. పెట్టేవాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్నా ఇబ్బంది లేదన్నట్లు ఇక్కడ వంట, వడ్డన సాగేదట.   ఏ ఫైవ్ స్టార్ హోట‌ల్ కీ తీసి పోని విధంగా ఇక్క‌డి  వంట‌లు ఎంతో రుచిక‌రంగా ఉండేవ‌ట‌.కేసీఆర్ తనతో ఉన్న అందరికీ ప్రతి రోజూ, ప్రతిపూటా రకరకాల నాన్ వెజ్ లతో ఇచ్చే ఈ విందు పెళ్లి దావత్ ను మించి ఉండేదంట. అంటే జనం సొమ్ముతో కేసీఆర్ తన, తన కుటుంబ సభ్యుల జిహ్వచాపల్యాన్ని తీర్చడమే కాకుండా, తనతో ఉన్న వారికీ విందు భోజనాలు పెట్టేవారన్న మాట. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయమేంటంటే.. ఈ గ్రాండ్ విందు భోజనం కొందరికే.. ఇక సీఎం భద్రతా సింబ్బంది, పనివాళ్లకు మాత్రం శాఖాహార వంటలే వడ్డించేవారట. ఇది కూడా పెద్ద సారు ఆర్డర్ ప్రకారమేజరిగేదంట. 

కేసీఆర్ కుటుంబసభ్యులతో పాటు బంధువులందరికి ప్రతిరోజు మాంసాహారం వంటలు తప్పనిసరి అన్న  ఆదేశాలుండేవ‌ట‌. కేవలం భోజనాల కోసమే వెయ్యి కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక‌ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డు సృష్టించారంటున్నారు పరిశీలకులు. మరో విషయం ఇప్పుడు చెప్పిన వెయ్యి కోట్ల లెక్క కేవలం ప్రగతి భవన్ విందు భోజనాలకిసంబంధించినది మాత్రమే. ఇది కాకుండా   ఎర్రవల్లి ఫాంహౌజ్ లెక్కలు ఇంకా బయటకు రావాల్సి ఉందని అంటున్నారు.

ఇప్పుడు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి ఐదేళ్ల పాలనా కాలంలో అంటే 2019 నుంచి 2024 మధ్య కాలంలో కేవలం ప్రయాణాలకే 222.85 కోట్ల ప్రజాధనం వెచ్చించారని ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. జ‌గ‌న్హయాంలో  విమాన ప్రయాణాల కోసం పెట్టిన ఖర్చు సైతం చర్చనీయాంశంగా మారింది.

2019 నుంచి 2024 మధ్య కాలంలో ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్- ఏపీఏసీఎల్  ద్వారా ఏకంగా రూ.222.85 కోట్లు వెచ్చించారని తాజాగా వెల్లడైన రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. కొవిడ్ లాక్‌డౌన్ సమయంలోనూ ఈ వ్యయం తగ్గకపోవడం గమనార్హం.జగన్ విమానయానం ఖర్చులు 2019-20- రూ.31.43 కోట్లుకాగా.. 2020-21- రూ.44 కోట్లు, 2021-22- రూ.49.45 కోట్లు, 2022-23- రూ.47.18 కోట్లు, 2023-24- రూ.50.81 కోట్లుగా చెబుతున్నాయి లెక్క‌లు. ఈ ఐదేళ్లలో జగన్ విమానాల చార్జీలు రూ.112.50 కోట్లు, హెలికాప్టర్ చార్జీలకు రూ.87.02 కోట్లు, ఇతర నిర్వహణ ఖర్చుల కింద రూ.23.31 కోట్లు చెల్లించిన‌ట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. హెలికాప్టర్ చార్జీల మొత్తాన్ని జీఎంఆర్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెల్లించినట్లు వెల్ల‌డిస్తున్నాయి రికార్డులు. జ‌గ‌న్ ఐదేళ్ల కాలంలో గాలి మోటారు ఖ‌ర్చుల‌ను ఏకంగా 220 కోట్ల మేర పెట్ట‌గా ఈ ప‌ద్దెనిమిది  నెల‌ల కాలంలో లోకేష్ పెట్టిన ఖ‌ర్చు జీరో అంటూ తెలుగుదేశం  సామాజిక మాధ్యమంలో పోస్టు చేసింది.  

అంతే కాదు.. స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా మంత్రి నారా లోకేష్ 77 సార్లు హైద‌రాబాద్ ప్ర‌యా ణించ‌గా.. ఆ విమాన ఖ‌ర్చులు పూర్తి సొంతంగానే పెట్టార‌ని ప్ర‌భుత్వ ఖ‌జానాపై ఎలాంటి భారం ప‌డ‌లే ద‌ని తేలింది.ఇటు తెలంగాణ‌లో కేసీఆర్, అటు ఏపీలో జ‌గ‌న్ ఇరువురూ వారి వారి హ‌యాంలో ప్ర‌జ‌ల సొమ్ము ఎంత‌గా వృధా ఖ‌ర్చు రూపంలో వెచ్చిస్తున్నారో ఇవి మ‌చ్చుకు కొన్ని మాత్ర‌మేనంటున్నారు ఆర్టీఐ కార్య‌క‌ర్త‌లు. కేసీఆర్, జగన్ లు ప్రజాధనాన్ని దుబారా చేసిన తీరు చూస్తుంటే, తన సొమ్ము సోమవారం ముప్పొద్దుల తింటారు, మంది సొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు అంటూ ఏదో సినిమాలో ఆరుద్ర రాసిన పాటలో పంక్తులు గుర్తుకు వస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu