మాట్రిమోనియల్ సైట్లో పరిచయం.. పెట్టుబడుల పేరుతో మోసం
posted on Oct 10, 2025 10:27AM

రూ.7.7 కోట్లు మోసపోయిన బాధితుడు
అమెరికాలో వ్యాపారం చేస్తూ ఉంటాను.. మ్యాట్రిమోనీలో మీ ప్రొఫైల్ చేశాను. చాలా అందంగా ఉన్నారు. మీ స్మైల్ బాగా నచ్చింది... నేను మీకు నచ్చితే వివాహం చేసు కుందాం అంటూ వలపు వల విసిరి, పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో దగ్గరై త్వరలోనే వివాహం అంటూ నమ్మించి.. ఆ తరువాత క్రిప్టో, స్టార్ట్-అప్, ఫారెక్స్, స్టాక్స్ మొదలగు ఎగుమతి కంపెనీలలో పెట్టుబడులు పెట్టొచ్చు కదా బోలోడు ఆదాయం అంటూ నమ్మించి కోట్ల రూపాయలు దోచేస్తున్నారు
నేరగాళ్లు. విదేశాల్లో వ్యాపారం లేదా ప్రోఫెషనల్స్ గా పరిచయం చేసుకుంటూ మేట్రిమోనియల్ లో ప్రొఫైల్ చూశాం అంటూ పరిచయం పెంచుకుని పెట్టుబడులు పెట్టమనే వారిని నమ్మవద్దని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయెల్ హెచ్చరించారు. వీటిలో ఇన్వెస్ట్ చేస్తే బోలెడు లాభాలు అంటూ నమ్మించి నకిలీ వెబ్ సైట్ లు చూపించి.. ముందు చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టించి లాభాలు వచ్చినట్లుగా చూపుతారు. ఆ తరువాత.. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే ఇంకా పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయంటూ నమ్మించి కోట్లలో దోచుకుంటారని శిఖాగోయెల్ హెచ్చరించారు. ఇటీవలే తెలంగా ణకు చెందిన ఓ బాధితుడు మ్యాట్రిమోనీ పేరుతో 7.7 కోట్ల రూపాయలు నష్టపోయాడని పేర్కొన్న శిఖాగోయెల్.. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి.. జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలను హెచ్చరించారు. ఎ సోషల్ మీడియా లేదా మాట్రిమోని యల్ ప్రొఫైల్ ద్వారా వచ్చిన సంబంధా లను జాగ్రత్తగా పరిశీలించి.. అన్ని వివరాలు తెలుసుకున్న తరువాతనే ముందుకు అడుగువేయాలని సూచించారు.
అలాగే పెట్టుబడులు పెట్టమంటూ అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని శిఖాగోయెల్ హెచ్చరించారు. ఆన్ లైన్ లోతెలియని వ్యక్తుల తో పరిచయం పెంచుకోవద్దని సూచించారు. అలాగే వ్యక్తిగత వివరాలు, ఫోటోలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వొదన్నారు. ఏదైనా అనుమానం కలిగినా, మోసపోయినా వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కి కాల్ చేసి లేదా www. Cyber crime.gov.in లో ఫిర్యాదు చేయాలని శిఖా గోయల్ ప్రజలకు సూచించారు.