ఫిమేల్ రైడర్స్.. ఫెమీరైడ్స్ సంస్థ వినూత్న ఆలోచన
posted on Oct 10, 2025 10:05AM

మహిళల కోసం, మహిళల రక్షణ కోసం విశాఖలో ఫెమీ రైడ్స్ పేరుతో మహిళా రైడర్స్ అందుబాటులోకి వచ్చారు. ఫెమీ రైడ్స్ పేరులో ప్రారంభమైన ఈ స్టార్టప్ మహిళల కోసం మహిళలే పని చేసేలా తీర్చి దిద్దారు. రాథికా బెహరా అనే ఓ మహిళ ప్రారంభించిన ఈ స్టార్టప్ ఇప్పుడు ఎందరో మహిళలకు ఉపాధిగా మారింది. ఈ ఫెమీ రైడ్స్ సంస్థ దాదాపు 500 మంది మహిళలకు డ్రైవింగ్ లో శిక్షణ ఇచ్చింది. ఈ మహిళా రైడర్లు మహిళా ప్రయాణీకులు భద్రంగా గమ్యం చేరేందుకు దోహదపడుతున్నారు. మహిళలు ఇప్పుడు ఫెమీ రైడ్స్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని తమతమ అవసరాలకు తగినట్లుగా టూ వీలర్, త్రీవీలర్, ఫోర్ వీలర్ లను బుక్ చేసుకుని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంది. ఈ ఫెమీరైడ్స్ స్టార్టప్ మహిళలకు ట్రావెల్ రంగంలో ఉపాధి కల్పిస్తోంది. నిస్సందేహంగా ఇది ట్రావెల్ రంగంలో కొత్త మార్పు అంటున్నారు మహిళలు. ఇప్పుడు విశాఖలో మహిళా రైడర్ల జోరు పెరిగింది.
రవాణా సదుపాయం లేక, ఆటోల్లో, ట్యాక్సీల్లో ఒంటరిగా వెళ్లే ధైర్యం చేయలేని మహిళలకు ఈ ఫెమీ రైడ్స్ యాప్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇపప్టికే హైద్రాబాద్, బెంగుళూరులో మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ట్రావెల్ ఏజెన్సీ లు ఉన్నాయి. ఇప్పడు విశాఖలో కూడా మహిళల కోసం మహిళలే పని చేసేలా ఫెమీరైడ్స్ అందుబాటులోకి వచ్చింది.
ఈ ఫెమీరైడ్స్ సంస్థ ప్రత్యేకత ఏమిటంటే.. మిగతా ఏజెన్సీలలా మహిళారైడర్స్ కు కమిషన్ రూపంలో కాకుండా, వేతనాలు చెల్లిస్తారు. ప్రస్తుతం ఫెమీరైడ్స్ సంస్థ బైక్ రైడ్, ట్యాక్సీ రైడ్, ఆటో రైడ్‌ల సేవలు అందిస్తోంది.