బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో భారీ దోపిడీ
posted on Oct 10, 2025 1:42PM

అబ్దుల్లాపూర్ మెట్ లోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజీలో భారీ దోపిడీ జరిగింది. ఆ కాలేజీలో పెద్ద మొత్తంలో సొమ్ము ఉందని తెలిసిన గుర్తు తెలియని వ్యక్తులు పక్కా స్కెచ్ లో దోపిడీకి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం కాలేజీ సిబ్బంది గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అసలా కాలేజీలో భారీ మొత్తంలో సొమ్ము ఉందన్న విషయం బయటకు ఎలా తెలిసిందనేది మిస్టరీగా మారింది.
ఇక దోపిడీ విషయానికి వస్తే..అబ్దుల్లాపూర్మెట్ లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీ లో గుర్తు తెలి యని దుండగులు చొరబడి కాలేజీలోని లాకర్స్ పగలకొట్టి దాదాపు కోటి రూపాయలు దోచుకున్నారు. మూడు కాలేజీలకు సంబంధించిన సొమ్ములను ఒకే చోట సేఫ్టీలాకర్ లో పెట్టి భద్రంగా తాళం వేసినా.. దుండగులు వాటిని పగుల గొట్టి సొత్తు దోచుకున్నారు. ఎక్కడా ఎలాంటి క్లూ వదలకూడదన్న ఉద్దేశంతో 200 సీసీ కెమెరాలు ఉన్న డివిఆర్ ను సైతం ఎత్తుకెళ్లారు. శుక్రవారం (అక్టోబర్ 10) ఉదయం కాలేజీకి వచ్చిన ఉద్యోగులు లాకర్ బ్రేక్ చేసి ఉండడం చూసి వెంటనే యాజమాన్యానికి సమాచారం అందించారు.
వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించే పనిలో ఉంది. కాలేజీలో అంత సొమ్ము ఒక్కచోటే గంపగుత్తగా ఉందని ఎవరెవరికి తెలుసు; లాకర్ తాళం చెవులు ఎవరి వద్దనున్నాయి. ఈ దోపిడీలో ఇంటి దొంగల హస్తం ఏమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పోలీసులు కాలేజీ పరిసర ప్రాంతాలలో సీసీ కెమేరాలను సైతం పరిశీలిస్తున్నారు.