కోల్ కతాలో వర్ష విలయం.. ఐదుగురు మృతి
posted on Sep 23, 2025 12:25PM

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో భారీ వర్షం జల విలయాన్ని సృష్టించింది. దసరా శరన్నవరాత్రులలో భాగంగా నగరమంతా దసరావేడుకలకు ముస్తాబైన వేళ భారీ వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది.
సోమవారం (సెప్టెంబర్ 22) అర్థరాత్రి దాటిన తరువాత మొదలై మంగళవారం (సెప్టెంబర్ 23)ఉదయం వరకూ ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి కోల్ కతా నగరం చిగురుటాకులా వణికింది. ఈ భారీ వర్షానికి నగరంలోని వేర్వేరు ప్రాంతాలలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. నగరం మొత్తం జల దిగ్భంధంలో చిక్కుకుంది. గడిచిన 24 గంటలలో కోల్ కతాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమో దైంది.కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ సమాచారం మేరకు నగరంలోని దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో వర్ష తీవ్రత చాలా చాలా అధికంగా ఉంది. గరియా కమ్‌దహరిలో కేవలం కొన్ని గంటల్లోనే ఏకంగా 332 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జోధ్‌పూర్ పార్క్‌లో 285, కాళీఘాట్‌లో 280.2, అలీపూర్‌లో 247.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.