మేడారంలో తులభారం సమర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి
posted on Sep 23, 2025 2:37PM
.webp)
సీఎం రేవంత్‌రెడ్డి ములుగు జిల్లా మేడారంలో పర్యటిస్తున్నారు. సమ్మక్క-సారలమ్మ అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పర్యటనలో సీఎంతోపాటు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు. మేడారం ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్షించనున్నారు
ఆదివాసీలు ఈ దేశానికి మూలవాసులని సీఎం అన్నారు. మేడారం పర్యటనలో భాగంగా ఆయన సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోరాటం, పౌరుషానికి ప్రతీకలైన సమ్మక్క-సారలమ్మ ఆశీర్వాదంతోనే ప్రజాప్రభుత్వం ఏర్పడిందని గుర్తుచేశారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచే అమ్మవార్లను దర్శించుకుంటున్నానని, 2023 ఫిబ్రవరి 6న మేడారం నుంచే తన పాదయాత్ర ప్రారంభమైందని తెలిపారు. ఆలయాన్ని శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని, సంప్రదాయంలో ఏ మార్పు రాకుండా ప్రజల అభిప్రాయాలతో ముందుకు వెళ్తామన్నారు.
భక్తి డబ్బులతో కొలవలేనిదని, నమ్మకమే నిజమైన కొలమానం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 100 రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. రాతి కట్టడాలతో నిర్మాణాలు ఉండేలా సూచించారు. ప్రకృతి ఒడిలో నిలిచిన ఈ ఆలయం ప్రత్యేకమని, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. ఆలయ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం జన్మ చరితార్థమని, ఇది ఒక వరమని అన్నారు. ఆదాయం కోసం కాదు, భక్తితో సేవ చేయాలని అధికారులకు సూచించారు. జంపన్న వాగులో నీటి నిల్వ కోసం చెక్‌డ్యాంలు నిర్మించాలని ఆదేశించారు. ప్రత్యేక డెడికేటెడ్ టీమ్ ఏర్పాటు చేసి ఆలయ అభివృద్ధిని వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.