శ్రీశైలంలో మోడీ ప్రత్యేక పూజలు
posted on Oct 16, 2025 4:15PM

ప్రధాని నరేంద్రమోడీ శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో కలిసి శ్రీశైలం ఆలయానికి విచ్చేసిన ఆయనకు వేద పండితులు, పూర్ణకుంభ స్వాగతం పలికారు. మొదటిగా స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేసిన ప్రధాని మోడీ అనంతరం అనంతరం శ్రీ భ్రమరాంబ అమ్మవారి సేవలో పాల్గొన్నారు. అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించిన తర్వాత ఆలయం బయట కాసేపు ధ్యానంలో గడిపారు.
పండితులు వేదమంత్రోచ్ఛారణాల మధ్య మోడీకి, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు ఆశీర్వాదం అందజేశారు. అమ్మవారి స్వామి వార్ల ప్రసాదాలను, అలాగే చిత్రపటాన్ని మోడీకి అందించారు. అలాగే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా శ్రీశైల ఆలయ కళా రూపాన్ని మోడీకి బహూకరించారు. ఆలయ విశేషాలను తెలిపారు. ప్రధాని మోడీ దాదాపు గంట సేపు శ్రీశైలం ఆలయంలో గడిపారు.
అనంతరం శ్రీశైలంలోని ఛత్రపతి శ్రీ శివాజీ మహారాజ్ స్మారక స్ఫూర్తి కేంద్రాన్నిమోడీ సందర్శించారు. కేంద్రంలోని గోడలపై ఉన్న శివాజీ జీవిత విశేషాలు తెలియజేసే చిత్రాలను ఆసక్తిగా తిలకించారు. దర్బార్ హాలు, ధ్యాన మందిరాల ప్రాముఖ్యతను అధికారులు శ్రీ మోదీ గారికి వివరించారు. ధ్యాన మందిరంలో ఉన్న అమ్మవారి విగ్రహానికి పూజ చేశారు. కేంద్రం నిర్వహణ వివరాలను తెలుసుకొని నిర్వాహకులను అభినందించారు.