సిమెంట్ బస్తాలు కూలి కార్మికులకు తీవ్ర గాయాలు
posted on Dec 12, 2025 10:21AM

సంగారెడ్డి జిల్లాలోని బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ సిమెంట్ గోడౌన్‌లో గురువారం రాత్రి సమయంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్ బస్తాల లాట్ ఒక్కసారిగా కూలిపడడంతో అక్కడ పనిచేస్తున్న తొమ్మిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని బొల్లారంలోని ఫస్ట్ ఛాయిస్ పరిశ్రమకు చెందిన సిమెంట్ నిల్వ గోడౌన్‌లో కార్మికులు రోజువారీగా సిమెంట్ మరియు అనుబంధ పదార్థాల బస్తాలను లోడింగ్, అన్‌లోడింగ్ చేస్తున్నారు.
ఇదే సమయంలో సిమెంట్ తయారీలో వినియోగించే లెడ్ క్రీమ్ బస్తాలు పెద్ద ఎత్తున ఒకేసారి కుప్పకూలి కార్మికులపై పడ్డాయి.ఈ ఘటనలో కార్మికులు అక్కడికక్కడే అమాంతం నేల మీద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి.సహచరులు వెంటనే గాయపడిన వారిని బొల్లారంలోని PBR హాస్పిటల్‌కు తరలించారు. ఆసుపత్రి వైద్యులు తొమ్మిది మందిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు బొల్లారం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కేసు నమోదు చేశారు. గోడౌన్‌లో జరిగిన ఈ ప్రమాదానికి భద్రతా ప్రమాణాలు పాటించాయా లేక నిర్లక్ష్యం కారణమా అనే అంశంపై విచారణ కొనసాగుతోంది.ఈ సంఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ పరిశ్రమల్లో కార్మికుల భద్రతపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.