ఈ నెల 26న రంగానాడు... పవన్, జగన్‌లపై కాపు నేతల్లో అసంతృప్తి
posted on Dec 11, 2025 7:10PM
.webp)
వంగవీటి రంగా ఆశయ సాధనను కొనసాగించి, బడుగు బలహీన వర్గాలకు గొంతుకయ్యే లక్ష్యంతో రాధా -రంగా మిత్రమండలి, సుదీర్ఘ విరామానంతరం ‘రంగానాడు’ పేరిట భారీ బలప్రదర్శనతో బహిరంగసభకు సన్నద్ధమవటం రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.
ఈ నెల 26న రంగా వర్ధంతి నాడు విశాఖ తీరంలో జరగనున్న సభకు లక్షమందికి పైగా హాజరవుతారన్నది నిర్వహకుల అంచనా. ఆ మేరకు టీడీపీ-జనసేన-వైసీపీకి చెందిన కాపు-మున్నూరు కాపులతోపాటు.. మందకృష్ణమాదిగ, ఎంపి ఆర్.కృష్ణయ్య, బీజేపీ మాజీ ఎంపి జీవీఎల్ నరసింహారావును కూడా ఆహ్వానించారు.
విశాఖ జిల్లాలోని కాపులు, విజయనగరం-శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లోని తూర్పు కాపులు.. సమీపంలోని ఉభయ గోదావరి జిల్లాల నుంచి కాపులతో భారీ స్థాయిలో బహిరంగ సభ నిర్వహించడం ద్వారా, రాజకీయాల్లో మళ్లీ కీలకపాత్ర పోషించాలన్నది రంగానాడు లక్ష్యంగా కనిపిస్తోంది.
ఇది కాపులకు సంబంధించిన సభ కాదు. రంగా అభిమానులది. రంగాకు అన్ని కులాల్లోనూ అభిమానులున్నారు. ఇది కులసభ కాదు. అందుకే ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ, బీసీ నాయకుడు, ఎంపి ఆర్.కృష్ణయ్య, బీజేపీ మాజీ ఎంపి జీవీఎల్ నరసింహారావు హాజరవుతున్నారు. రంగా 38వ వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలు ఏవిధంగా కొనసాగించాలన్నదే ఈ సభ అజెండా.
ఆ సందర్భంగా కొన్ని తీర్మానాలు ప్రవేశపెడతామని రాయలసేన కన్వీనర్ పోరుమామిళ్ల ఈశ్వర్ రాయల్ వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం కాపుల్లో నెలకొన్న గందరగోళం, కాపు సంఘాల అసంతృప్తి పరిశీలిస్తే.. విశాఖ సభ కాపుల బలప్రదర్శనగానే కనిపిస్తోంది. కూటమి అధికారంలోకి రాకముందు తాము పెట్టుకున్న ఆశలు, అంచనాలు తల్లకిందులయ్యాయని.. తమ కులానికి చెందిన పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయినా తమకు ఎలాంటి న్యాయం జరగడం లేదని, కాపు సంఘాలు ఇటీవల నిర్వహించిన కార్తీక వనభోజనాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పవన్ మాకేదో చేస్తారని, మమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారని ఆశించి జనసేన- ఆ పార్టీ మద్దతునిచ్చిన టీడీపీకి ఓట్లు వేశాం. మాకు ఇష్టం లేకపోయినా పవన్‌ను చూసి, జగన్‌కు వ్యతిరేకంగా టీడీపీకి ఓట్లు వేశాం. కానీ అసలు పవన్ కాపు సంఘాలకు అపాయింట్‌మెంట్ ఇవ్వటం లేదు. కాపు సంఘాలను దగ్గరకే రానీయడం లేదు. గతంలో మనకు టీడీపీలో ప్రాధాన్యం ఉండేది. చంద్రబాబు మనల్ని బాగా చూసుకున్నారని కాపు నేతలు అంటున్నారు.
ఇప్పుడు కూటమిలో పవన్ ఉన్నందున ఆ పార్టీ కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మనం వెళ్లి టీడీపీ కాపు ఎమ్మెల్యేలకు సమస్యలు చెబితే.. పార్టీ మమ్మల్నే పట్టించుకోవడం లేదు. ఇక మేం మీకేం చేయగలం? పరిస్థితులు అప్పటిలా లేవు. మీరు వెళ్లి పవన్‌ను కలవండి అని తమ నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. పవన్ తమతో ఉన్నందున మిగిలిన కాపులను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న ధోరణిలో టీడీపీ ఉంది.
దీనితో మనం రెంటికీ చెడ్డ రేవడి అయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు చూస్తే జగన్ మనకు వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఏం చేయాలో మీరే ఆలోచించి చెప్పండి అంటూ వనభోజనాల్లో కాపు సంఘ నేతలు, తమ కులస్తులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాగా విశాఖలో ఈనెల 27న జరగనున్న కాపునాడులో.. ఈ అసంతృప్తి ప్రతిబించబోతోందని, కాపు నేతలు జోస్యం చెబుతున్నారు.