Akhanda 2 Movie Review : అఖండ 2 మూవీ రివ్యూ
on Dec 11, 2025

సినిమా పేరు: అఖండ 2
తారాగణం: బాలకృష్ణ, సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, కబీర్ సింగ్, హర్షాలీ మల్హోత్రా ఛటర్జీ తదితరులు
ఎడిటర్: తమ్మిరాజు
మ్యూజిక్: థమన్
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
సినిమాటోగ్రాఫర్: రామ్ ప్రసాద్, సంతోష్ దేటకే
బ్యానర్స్: 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్, ఐవివై ఎంటర్ టైన్ మెంట్
నిర్మాతలు:రామ్ ఆచంట, గోపి ఆచంట, ఇషాన్ సక్సేనా
సమర్పణ: తేజస్విని నందమూరి
విడుదల తేదీ: డిసెంబర్ 12, 2025
అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య వన్ మాన్ షో 'అఖండ 2 ' ఈ రోజు ప్రీమియర్స్ తో థియేటర్స్ లో అడుగుపెట్టింది. బాలయ్య, బోయపాటి కాంబో కావడంతో పాటు బాలయ్య పాన్ ఇండియా రేంజ్ లో అడుగుపెట్టడంతో అంచనాలు హై రేంజ్ లో ఏర్పడ్డాయి. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
అఖండ(అఘోర బాలకృష్ణ) శివుడికి మరింత దగ్గరగా ఉండటం కోసం హిమాలయాల్లో కఠిన తరమైన నిబంధనలో ఉంటాడు. రెండు పొరుగు దేశాల ఆర్మీ అధినేతలైన జనరల్స్ (శాశ్వత ఛటర్జీ, సంగై షెల్టరీమ్) భారత దేశ ప్రజల్లో ఉన్న ఒక నమ్మకాన్ని దెబ్బ కొట్టడానికి నిర్ణయించుకుంటారు. మరో వైపు భారత దేశ ప్రధాన మంత్రి ఆదిత్య రావు భగత్ ని పదవి నుంచి దింపడానికి అజిత్ ఠాకూర్(కబీర్ సింగ్) ప్రయత్నిస్తుంటాడు. క్షుద్రశక్తులు నింపుకొని ఉన్న అతీంద్రియ శక్తి పిశాచి(ఆది పినిశెట్టి) అందుకు అండగా ఉంటాడు. మరో వైపు జనని ( హర్షాలీ మల్హోత్రా) ప్రపంచాన్ని కాపాడానికి ఒక వ్యాక్సిన్ తయారుచేస్తుంది. దీంతో జనని ప్రాణాలని ప్రమాదం ఏర్పడుతుంది. వేరే దేశానికి చెందిన ఆర్మీ అధినేతలు భారత దేశ ప్రజల ఏ నమ్మకాన్ని దెబ్బకొట్టాలని అనుకున్నారు? అందుకు వాళ్ళు చేసిన కుట్ర ఏంటి? జనని వ్యాక్సిన్ ఏ పర్పస్ కోసం తయారు చేసింది? ఆదిత్య రావు భగత్ ని ప్రధాన మంత్రి పదవి నుంచి దించడానికి అజిత్ ఠాకూర్ ప్రయత్నాలు ఫలించాయా? అందుకు పిశాచి అండగా ఉంటానికి కారణం ఏమైనా ఉందా? ఈ సమస్యలన్ని హిమాలయాలయాల్లో ఉన్న అఖండ దృష్టికి వచ్చాయా? వస్తే వాటికి అఖండ చూపించిన పరిష్కారం ఏంటి? మరి ఈ కథలో బాలకృష్ణ పోషించిన మురళి కృష్ణ క్యారక్టర్ ఏంటి? అసలు అఖండ మార్గం ఏంటనేదే అఖండ 2 చిత్ర కథ.
ఎనాలసిస్
మేకర్స్ చాలా తెలివిగా మూవీ ప్రారంభమే అఖండ మొదటి పార్ట్ లోని ప్రధానమైన కథని ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూపించారు. దీంతో పారవశ్యంతో పార్ట్ 2లోకి లీనమైపోతాం. అందుకు తగ్గట్టే మూవీ మొదటి నుంచి చివరి వరకు మంచి టెంపోతోనే నడిచింది. ప్రతి సీన్ ఎంతో రిచ్ గా ఒక మంచి పర్పస్ తోనే వచ్చాయి. మురళి కృష్ణ క్యారక్టర్ తో ఏపీకి సంబంధించి చెప్పించిన డైలాగ్ బాగున్నాయి.
అసలు ఒకే కాస్ట్యూమ్ తో ప్రేక్షకులని సినిమా మొత్తం కూర్చోబెట్టడం అంటే అది బాలయ్య, బోయపాటి కే సాధ్యమైంది.వేరే వాళ్ళు కూడా బాలయ్య ని పెట్టి ఈ లెవల్లో తెరకెక్కించలేరు. కాకపోతే సన్నివేశాల్లోని డైలాగ్స్ మరింతగా మెప్పించి ఉండాల్సింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మాత్రం ప్రాణంగా నిలిచాయి. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే అఖండ ఎంట్రీ సీన్స్ తో పాటు అందుకు పారలల్ గా వచ్చిన సన్నివేశాలతో నెక్స్ట్ ఏం జరగబోతుందనే క్యూరియాసిటీ కలిగింది.
ఇండియాపై ద్వేషం ఉన్న జనరల్ కి మరో జనరల్ ఇండియా గొప్పతనం ఎక్కడ ఉందని చెప్పే సీన్స్ తో పాటు ఆ ఇద్దరు ఏం చెయ్యబోతున్నారనే ఉత్కంఠత బాగానే పేలింది. కుంభమేళాలో వచ్చిన సీన్స్ కూడా బాగున్నాయి. సంయుక్త మీనన్,బాలకృష్ణ పోషించిన రెండో క్యారక్టర్ మురళి కృష్ణ పై వచ్చిన మందు సీన్ హైలెట్. ఈ సీన్ ని ఇంకాస్త పెంచి ఎంటర్ టైన్ మెంట్ ని జోడించాల్సింది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ లో మూవీ స్వరూపం మొత్తం మారిపోయింది.
పూర్తిగా అఖండ వన్ మాన్ షో అని చెప్పవచ్చు. ప్రతి సీన్ తో పాటు ప్రతి డైలాగ్ ఎంతో ఆసక్తిని కలిగించాయి. పిశాచి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సూపర్ గా పేలడంతో పాటు సెల్యులాయిడ్ పై మరో ప్రపంచం ప్రత్యక్షమైంది. శివుడి రాక, ఆ సందర్భంగా శివుడు చెప్పే చెప్పే డైలాగ్స్ మరో లెవెల్. అఖండ పోరాటాలు, అంతిమంగా మానవాళికి దేవుడి గురించి చెప్పే మాటలు కూడా ఎంతో మందిని ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ ప్రధాన బలంగా నిలిచింది. బాలకృష్ణ చేసిన శివ తాండవం, కైలాసంలో శివుడు చేసే తాండవం ప్రధాన హైలెట్. విఎఫ్ఎక్స్ వర్క్ ని కూడా ఎంత వరకు ఉపయోగించుకోవాలో అంత వరకు వాడుకున్నారు.
నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు
అఘోర, మురళి కృష్ణ అనే రెండు డిఫరెంట్ క్యారక్టర్ లలో బాలయ్య నటన మరోసారి నభూతో న భవిష్యత్తు అనే రీతిలో కొనసాగింది. ముఖ్యంగా శివస్తుతుడైన అఘోర గా బాలయ్య నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన క్యారక్టర్ యొక్క ఔచిత్యం మొత్తాన్ని తన కళ్ల ద్వారానే చెప్పాడు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా థియేటర్ లో కూర్చున్న ప్రతి ఒక్కరు తనలో లీనమయ్యేలా బాలయ్య నటప్రస్థానం కొనసాగింది. ఎన్నో కష్టతరమైన సీన్స్ ని అవలీలగా చేసి మరోసారి తనకి తానే సాటి అనిపించాడు. మురళి కృష క్యారక్టర్ లో కూడా ఎంతో హుషారుగా చెయ్యడంతో పాటు డాన్స్ ల్లో కూడా తన స్టామినా తగ్గలేదని చాటి చెప్పాడు. బాలకృష్ణ కూతురుగా జనని క్యారక్టర్ లో చేసిన హర్షాలీ మల్హోత్రా క్యూట్ నటనతో ఆకట్టుకుంది. ఆమెకి మరిన్ని తెలుగు సినిమాల్లో ఆఫర్స్ రావడం గ్యారంటీ. సంయుక్త మీనన్ మరో సారి తన నాచురల్ నటనతో కట్టిపడేసింది. పిశాచి గా చేసిన ఆది పినిశెట్టి అద్భుతమైన పెర్ ఫార్మెన్సు తో మెప్పించడమే కాదు భయబ్రాంతులకి కూడా గురి చేసాడు. అఖండ 2 తన కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలబడిపోతుందని చెప్పవచ్చు .కబీర్ దుహన్ సింగ్ , శాశ్వత ఛటర్జీ, సంగై షెల్టరీమ్ లు కూడా తమదైన విలనిజంతో మెప్పించారు.ఇక థమన్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో థియేటర్స్ లోని ప్రేక్షకుల చేత శివతాండవం చేయించాడు. ముఖ్యంగా అఘోర క్యారక్టర్ కి ఇచ్చిన బిజీఎం గురించి అయితే ఎంత చెప్పుకున్నా తక్కువే. అఘోర క్యారక్టర్ కోసం బిజిఎం పుట్టిందా. బిజిఎం కోసం అఘోర క్యారక్టర్ పుట్టిందా అనే రీతిలో కొనసాగింది. దీన్ని బట్టి థమన్ అఖండ 2 కోసం ఎంత శివతత్వాన్ని నింపుకొని పని చేసాడో అర్ధం చేసుకోవచ్చు. 14 ప్లస్ నిర్మాణవిలువలు కూడా ఎంతో రిచ్ గా ఉన్నాయి. అఖండ 2 తో వాళ్ళ జన్మ ధన్యమైనట్టుగా కూడా భావించవచ్చు . ఫొటోగ్రఫీ కూడా మరో ప్రాణంగా నిలిచింది.
ఫైనల్ గా చెప్పాలంటే బాలయ్య, బోయపాటి కాంబో ఎలా ఉండాలని అభిమానులు కోరుకుంటారో అదే విధంగా అఖండ 2 ఉంది. కాకపోతే లాజిక్ లు వెతకకూడదు. నాస్థికులు దూరంగా ఉంటే బెస్ట్. ఎందుకంటే అఖండ 2 దేవుడిని నమ్మే వాళ్ళది. అంతకంటే ముఖ్యంగా శివ భక్తులది. పెట్టిన డబ్బులకి పూర్తి సంతృప్తి మాత్రం ఖాయం.
Rating 3/5
అరుణా చలం
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



