నోబుల్ బ‌హుమ‌తి బ‌దిలీ చేయొచ్చా?

 

ఇటీవ‌ల నోబెల్ శాంతి బ‌హుమ‌తి  గ్ర‌హీత కొరినా మ‌చాడో.. వైట్ హౌస్ లో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మానికి వెళ్లి.. అక్క‌డ త‌న‌కొచ్చిన  బహుమ‌తిని అధ్య‌క్షుడు ట్రంప్ కి అందించి.. త‌న‌దైన ఉదార‌త చాటుకున్నారు. దీంతో ఎట్ట‌కేల‌కు నోబెల్ బ‌హుమ‌తి నాకే.. అంటూ ట్రంప్ పేరిట ప‌లు కామెంట్లు సెటైర్లు వెలువ‌డుతున్నాయ్.

ఇంత‌కీ నోబెల్ నిబంధ‌న‌లు ఏం చెబుతున్నాయో చూస్తే బ‌హుమ‌తి ఒక్క‌సారి క‌మిటీ ప్ర‌ధానం చేస్తే.. అందులో మ‌రోమార్పు ఉండ‌దు. అవి ఆయా వ్య‌క్తుల పేరిట మాత్ర‌మే లిఖించ‌బ‌డ‌తాయి. వారు మాత్ర‌మే ఆయా విభాగాల విజేత‌లుగా ప‌రిగ‌ణించ‌బ‌డ‌తారు. ఇది ఇవాళ్టి నియ‌మ- నిబంధ‌న కాదు.. అల్ ఫ్రెడ్ నోబెల్ పేరిట ఈ అవార్డులు ఇవ్వ‌డం  నుంచీ మొద‌లైన ఒకానొక ఆచారం.

అయితే ఆయా విజేత‌ల‌కు త‌మ‌కొచ్చిన బ‌హుమ‌తి ద్వారా వ‌చ్చిన మొత్తాన్ని.. ఎవ‌రికైనా ఇవ్వొచ్చు. మ‌రేదైనా  చారిటీకి స‌మ‌ర్పించుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం మ‌చాడోకి 11 మిలియ‌న్ల స్వీడిష్ క్రోనార్లు బ‌హుమ‌తితో పాటు ఇచ్చారు. ఇది భార‌తీయ  క‌రెన్సీలో చెబితే సుమారు 10 కోట్ల మేర ఉంటుంది. ఈ మొత్తం  ఆమె ఏదైనా చారిటీ సంస్థ‌ల‌కు దానం చేసుకోవ‌చ్చు. అది ఆమె ఇష్టం. అయితే  ఆ అవార్డు భౌతికంగా  ఎవ‌రి చెంత ఉన్నా  కూడా విజేత మాత్రం మ‌చాడోనే.

ఆ బ‌హుమ‌తిని క‌మిటీ ఫ‌లానా వారి పేరిట రాసి వారికిస్తే ఇక వారికే సొంతం. దాని బ‌దిలీ చేయ‌డానికి ఎంత మాత్రం వీలు కాదు. ఈ లెక్క‌న ఈ బ‌హుమ‌తిని గ్ర‌హీత నుంచి తీసుకున్నంత మాత్రాన దాని విలువ పెర‌గ‌దు- త‌ర‌గ‌దు, బ‌దిలీ అంత‌క‌న్నా కాద‌ని చెబుతున్నాయ్ నార్వేజియ‌న్ నోబెల్ క‌మిటీ రూల్స్ అండ్ రెగ్యులేష‌న్స్.

దానికి తోడు దేశాల‌కు దేశాలు ఆక్ర‌మించే కుయుక్తులు వేస్తున్న  ట్రంప్ న‌కు నోబెల్ శాంతి బ‌హుమ‌తికాదు క‌దా.. ఆ పేరు ఎత్త‌డానికే అన‌ర్హుడిగా  భావిస్తున్నారు చాలా మంది. ప్ర‌స్తుతం ఇరాన్ అట్టుడుకుతోందంటే అందుకు ప్ర‌ధాన కార‌కుడు ట్రంపే. ఇక వెనుజువెలా  సంగ‌తి  స‌రే స‌రి. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఇంత‌టి విచ్చిత్తికి కార‌కుడ‌వుతోన్న ట్రంప్ చేతికి నోబెల్ శాంతి బ‌హుమ‌తి ఇవ్వ‌డం కూడా నేర‌మే అన్న మాట వినిపిస్తోంది. 

వెనుజువెలా  ప్ర‌తిప‌క్ష  నేత  మ‌చాడో ఈ ప‌ని ఎందుకు చేశారో అన్న చ‌ర్చ‌కు సైతం తెర‌లేచింది. బ‌హుశా ట్రంప్ త‌న‌కు మ‌చాడో నోబెల్ బ‌హుమ‌తి ఇచ్చినందుకు ఆమెనే ఆ దేశ త‌ర్వాతి అధ్య‌క్షురాలిగా నియ‌మిస్తారా? అలాగైతే మ‌చాడోకి ఇచ్చిన శాంతి బ‌హుమానం కూడా క‌ళంకితం  అవుతుంది క‌దా? అన్న మాట కూడా వినిపిస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News