మేడారం మహాజాతర ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం.. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క
posted on Jan 17, 2026 1:49PM

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా జాతర ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.ఇందు కోసం కోసం ఏర్పాటైన మహాజాతర ట్రస్ట్ బోర్డు శనివారం (జనవరి 17) ప్రమాణ స్వీకారం చేసింది. మహాజాతర ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నియమితులైన ఇర్ప సుకన్య సునీల్ దోర. 15 మండి డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇక పోతే మేడారం మహాజాతర కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) విస్తృత స్థాయిలో సన్నాహాలు చేస్తోంది. లక్షల మంది భక్తులు వన దేవత లైన సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు తరలి రానున్న నేపథ్యంలో.. వారికి ఎటువంటి ప్రయాణ ఇబ్బందులూ తలెత్తకుండా టీఎస్ఆర్టీసీ రవాణా ప్రణాళికను సిద్ధం చేసింది. మహాజాతర కోసం టీఎస్ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా 4 వేల ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెస్తోంది. మొత్తం 42,810 ప్రత్యేక ట్రిప్పులు నిర్వహించి దాదాపు 20 లక్షల మంది భక్తులకు మేడారం జాతరకు రాకపోకలకు ఇబ్బందులు లేకుండా సర్వీసులు అందుబాటులో ఉంచనుంది.
హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచీ, అలాగే పక్క రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడప నుంది. ఇక మేడారం మహాజాతరకు స్వయంగా వెళ్లలేని భక్తులకు కూడా ఆర్టీసీ సేవలందించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దేవాదాయ శాఖ సమన్వయంతో భక్తుల ఇంటి వద్దకే సమ్మక్క–సారలమ్మ ప్రసాదాన్ని అందించడానికి కూడా ఏర్పాట్లు చేసింది. ఇందు కోసం 299 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
అలా చెల్లించిన భక్తులకు వారి ఇంటి వద్దకే ఇంటి సమ్మక్క, సారలక్క బంగారం ప్రసాదం ప్యాకెట్ ను అందించడానికి ఏర్పాట్లు చేసింది. ఈ ప్రసాద ప్యాకెట్‌లో అమ్మవార్ల ఫొటోతో పాటు బెల్లం, పసుపు, కుంకుమ ఉంటాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతర కోసం విస్తృత ఏర్పాట్లు చేసింది. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా మౌలిక సదుపాయల కల్పన చేసింది. భక్తుల రాకపోకల ను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, భద్రత వంటి అంశాల్లోనూ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 28 నుంచి నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా మేడారం మహా జాతర జరగనున్న సంగతి తెలిసిందే