మంత్రి నారాయణ చొరవతో 18 మంది యువకులకు పునర్జీవం
posted on Sep 16, 2025 7:15PM

మంత్రి పొంగూరు నారాయణ చూపిన చొరవ 18 మంది యువకుల ప్రాణాలకు పునర్జీవం ప్రసాదించింది. మంత్రి తీసుకున్న ప్రత్యేక శ్రద్ధతో సురక్షితంగా ఆపదలో ఉన్న వారిని అధికారులు బయటకి తీసేందుకు తెల్లవారుజాము వరకు కృషి చేసి ఫలితం రాబట్టారు. అసలేం జరిగిందంటే. నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీకి చెందిన 18 మంది యువకులు సమీపంలోని పెన్నా నదిలోకి సోమవారం సాయంత్రం వెళ్లారు. వారు వెళ్లిన సందర్భం ఏదైనాప్పటికీ ఊహించని పరిణామానికి గురయ్యారు. సోమశిల జలాశయం నుంచి నీటిని విడుదల చేయడంతో పెన్నా నది ఉద్ధృతి పెరిగింది. ఈ క్రమంలో రెండు వైపులా నీరు రావడంతో యువకులు పెన్నా నదిలో మధ్యలో చిక్కుకున్నారు. దిక్కుతోచని స్థితిలో సహాయం చేయమని బంధువులకు ఫోన్లు చేసి ఆర్తనాదాలు పెట్టారు.
అయితే ఈ విషయాన్ని యువకుల తల్లిదండ్రులు స్థానిక డివిజన్‌లో టీడీపీ ఇన్చార్జిలకు తెలియజేశారు. వెంటనే వారు పెన్నా నదిలో 18 మంది యువకులు చిక్కుకున్నారన్న విషయాన్ని నారాయణకు తెలియజేశారు. వెనువెంటనే అప్రమత్తమైన మంత్రి ఆ యువకులను రక్షించేలా సహాయ చర్యలు చేపట్టాలని టీడీపీ శ్రేణులను ఆదేశించారు. అలాగే అన్ని శాఖల అధికారులను మంత్రి నారాయణ అప్రమత్తం చేశారు. సోమవారం రాత్రి నుండి మంగళవారం తెల్లవారుజాము వరకు నిరంతరం టైం టు టైం అప్డేట్ కనుక్కుంటూ మంత్రి నారాయణ అధికారులకు పలు సూచనలు చేస్తూ వచ్చారు.
ఈ క్రమంలో నెల్లూరు ఆర్డీవో, పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది స్పందించి రెస్క్యూ టీమ్ ద్వారా మంగళవారం తెల్లవారుజాము సమయానికి 18 మందిని సురక్షితంగా కాపాడగలిగారు. ఈ విషయాన్ని టిడిపి శ్రేణులు, ఆయా శాఖల అధికారులు మంత్రి నారాయణ కు తెలియజేశారు. అనుకోని పరిస్థితుల్లో పెన్నా నదిలో చిక్కుకున్న యువకులను చాకచక్యంగా కాపాడిన ఆయా శాఖల అధికారులను, ప్రమాదం అని తెలిస్తే వెంటనే స్పందించిన టీడీపీ శ్రేణులను మంత్రి నారాయణ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే తమ బిడ్డలు సురక్షితంగా బయటకు వచ్చేందుకు నిరంతరం అధికారులను అప్రమత్తం చేస్తూ తమకు భరోసా ఇచ్చిన మంత్రి నారాయణ కు యువకుల తల్లిదండ్రులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఏదైతేనేం తన నియోజకవర్గ ప్రజల మన్నలలో పొందిన నారాయణ ప్రజా సంక్షేమమే ద్యేయంగా నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ప్రశంసలు పొందుతున్నారు.