మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న లొంగుబాటు
posted on Oct 16, 2025 12:56AM

రెండు రోజుల్లో 258 మంది నక్సలైట్ల లొంగుబాటు.. అమిత్ షా
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, అగ్రనేత తక్కళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న పోలీసుల ఎదుట లొంగిపోయారు. నక్సల్స్ కీలక నేత మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోయిన ఒక రోజు వ్యవధిలోనూ ఆశన్న లొంగుబాటు జరగడం విశేషం. ఈ లొంగుబాట్లతో మావోయిస్టు ఉద్యమానికి తేరుకోలేని దెబ్బతగిలినట్లేనని పరిశీలకులు అంటున్నారు. వరుస లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ ఇక కోలుకోవడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.
బుధవారం (అక్టోబర్ 15) మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట మల్లోజుల లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటుగా మరో 60 మంది మావోయిస్టులు కూడా ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు. ఇక అదే రోజు ఛత్తీస్ గడ్ లోని వివిధ ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయినట్లు సమాచారం. ఇలా లొంగిపోయిన వారిలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన కీలక నేతలు రాజమన్ మండావి, రాజు సలామ్ కూడా ఉన్నారు. ఇది జరిగిన 24 గంటల వ్యవధిలో ఆశన్నఆయుధాలు అప్పగించి లొంగిపోయారు. ఆశన్న చాలా కాలంగా సాయుధ పోరాటం కంటే చర్చలే మేలు అంటూ పలు లేఖలు విడుదల చేసినట్లు చెబుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో కూడా ఆశన్న తుపాకీ ద్వారా కాదు చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. .
ఇక ఈ రోజు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన ఆశన్న స్వస్థలం తెలంగాణలోని ములుగుజిల్లా లక్ష్మీదేవి పెట. ఈయన 1989లో ఆజ్ణాతంలోకి వెళ్లారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అనేక దాడుల్లో ఆశన్న కీలక పాత్ర పోషించారు. 1999లో హైదరాబాద్‌లో ఐపీఎస్ అధికారి ఉమేశ్ చంద్ర హత్య, 2000లో ఘట్‌కేసర్ వద్ద మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి హత్య కేసుల్లో ఆయన నిందితుడు.అలాగే 2003లో తిరుపతి అలిపిరి వద్ద అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై జరిగిన క్లెమోర్ మైన్స్ దాడికి నాయకత్వం వహించింది కూడా ఆశన్నే.
కాగా ఛత్తీస్ గఢ్ లో గత రెండు రోజులుగా పెద్ద సంఖ్యలో నక్సలైట్లు లొంగిపోయిన విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఈ లొంగుబాట్ల వివరాలను అమిత్ షా స్వయంగా వెల్లడించారు. గత రెండు రోజుల్లో మొత్తం 258 మంది ఆయధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిశారని తెలిపారు. ఈ పరిణామం నక్సలిజంపై పోరాటంలో ప్రధాన విజయంగా అభివర్ణించారు.