శ్రీవారికి విలువైన కానుక సమర్పించిన తెలంగాణ బీజేపీ ఎంపీ

 

తిరుమల శ్రీవారికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మంగళవారం నాడు భారీ విరాళం సమర్పించారు. సుమారు రూ.60 లక్షల విలువైన అత్యంత అపురూపమైన స్వర్ణాభరణాన్ని ఆయన స్వామివారికి కానుకగా అందించారు. ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి 535 గ్రాముల బరువున్న అష్టలక్ష్మీ చంద్రవంక కంఠి అనే స్వర్ణ కంఠాభరణాన్ని శ్రీవారికి సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు. తిరుమలలోని రంగనాయకుల మండపంలో జరిగిన ఒక కార్యక్రమంలో, టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి తాము ఈ విరాళాన్ని స్వీకరించినట్లు టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు.

ఈ ఏడాది తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. వీటి ప్రారంభానికి ముందు రోజు, అంటే సెప్టెంబర్ 23వ తేదీ రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య ఆలయ యాగశాలలో అంకురార్పణ ఘట్టం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం జరిగే ఈ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలకు బీజం పడుతుంది.

అంకురార్పణలో నవధాన్యాలను మొలకెత్తించి భూమి పాడిపంటలతో, పశుపక్ష్యాదులతో సస్యశ్యామలంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీ విష్వక్సేనులవారి ఊరేగింపు ఉంటుంది. ఇది బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించే ఆధ్యాత్మిక సూచనగా భావిస్తారు.నవధాన్యాలు మొలకెత్తేందుకు అవసరమైన పుట్టమన్ను కోసం ముందుగా మేదినిపూజ నిర్వహించి భూదేవిని ప్రసన్నం చేసుకుంటారు. ఈ సందర్భంగా అర్చకులు భూసూక్తాన్ని పఠిస్తూ ప్రత్యేక వేదకార్యక్రమాలు చేస్తారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu