ప్రాణం తీస్తోన్న అభిమానం
posted on Sep 28, 2025 10:53AM

చాలా మంది అంటుంటారు.. నువ్వంటే నాకు చచ్చేంత అభిమానమని. అది ఇదే. మనం ఇటు హీరోలు, క్రికెటర్లు కానీ, అటు దేవుళ్లను, లేదా ఇతరత్రా కొన్ని కొన్ని విషయాల పట్ల పెంచుకునే అభిమానం కాస్తా ఇదిగో ఇలాంటి విషాద ఘటనలకు కారణమవుతోంది.
మొన్నంటే మొన్న తమ అభిమాన జట్టు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఐపీఎల్ కప్పు కొట్టిందన్న ఒకే ఒక్క ఆలోచనతో స్టేడియంకి వెళ్లి ఎందరు చనిపోయారో తెలిసిందే. ఈ మరణాల విషాదం మరవక ముందే మరో తీవ్ర విషాదం. ఇప్పుడు చూస్తే ఇదయ దళపతిగా అభిమానుల చేత ముద్దుగా పిలిపించుకునే విజయ్ సభకు వచ్చిన వాళ్లు ఏకంగా 38 మంది స్పాట్ డెడ్ కాగా.. మరి కొందరి పరిస్థితి విషమంగా చెబుతున్నారు.
ఇదిలా ఉంటే కరూర్ ప్రభుత్వ ఆస్పత్రులు శోక సంద్రంలో మునిగిపోయింది. తమ తమ ఆశాజ్యోతులు ఆరిపోవడంతో వారంతా కలసి దీనంగా రోదిస్తుంటే.. దీనంతటికీ కారకుడైన విజయ్ కేవలం ఒక గుండె పగిలిందన్న ప్రకటనతో సరి పెట్టేశాడు.
ఆ మాటకొస్తే మొన్నటి బెంగళూరు స్టేడియం ఘటనలో ఒక తండ్రి కొడుకును ఖననం చేసిన చోట నుంచి కదలకుండా ఏడ్చిన ఏడుపులు ఇప్పటికీ కర్ణాటక వాసుల గుండెలను మెలిపెడుతూనే ఉన్నాయి. దేశమంతటా కూడా ఆ తండ్రి దుఃఖం తీవ్రంగా లోచింప చేసింది. ఎవ్వరూ కూడా ఆయన కడుపుకోతకు మందు పూయలేక పోయారు.
ఏం అభిమానమిది? కోహ్లీ వచ్చి ఆ తండ్రికి తన బిడ్డను అందివ్వగలడా? ఇప్పుడు విజయ్ పరిస్థితి కూడా అంతే ఏడుగురు చిన్నపిల్లలు చనిపోయారు. ఒక సినిమా చేస్తే విజయ్ కి వంద కోట్లయినా తిరిగి వస్తాయోమో గానీ వీరి ప్రాణాలు తిరిగి తీసుకురావడం సాధ్యమా?
ఇటు పెద్దలకు కూడా బుద్ధి పాడు లేకుండా పోయింది. పిల్లలన్నాక సినిమా హీరోలను దగ్గర్నుంచి చూడాలని మారాం చేస్తుంటారు. అలాగని ఇంత కిక్కిరిసే సభలు తమ పిల్లా జెల్లా వెంట వేసుకుని రావడమేంటి?
పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట సంగతి సరే సరి. ఆ తల్లీ కొడుకుల జీవితాలు ఆగమై పోయాయి. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఇప్పుడా తల్లి చనిపోయిన కుర్రాడి పరిస్థితేంటి? జీవితమంతా ఆ తల్లిలేని లోటుతో పాటు.. వెన్నంటే వచ్చే ఆ విషాద జ్ఞాపకాలు, అది తెచ్చిన విపత్తును ఒక జీవిత కాల భారంగా భరించాల్సిందేగా? దీనంతటికీ కారణం పైసాకు పనికిరాని అభిమానం.
సరే ఇక్కడంటే మీరు సినిమా హీరోలను ఆడి పోసుకుంటున్నారు. మరి దేవుళ్ల పరిస్థితేంటి? ఆయా ఉత్సవాలు, కుంభమేళాల్లో పోయిన ప్రాణాలు ఎవరి ఖాతాలో వేయాలి? అని అడిగే వారుండొచ్చు. ఇటీవల రెండు మూడు విషాద వార్తలు. ఒకటి తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట కాగా, మరొకటి సింహాచలం అప్పన్న గోడ కూలిన ఘటన.
ఇక కుంభమేళా సంగతి సరే సరి. పవిత్ర స్నానాల కోసమని వెళ్లిన వారు.. పై లోకాలకు చేరిపోయారు. కొందరైతే తిరిగొస్తుండగా జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు.
జనం ఎక్కువగా పోగయ్యే ఏ ప్రాంతమైనా సరే.. ఇదే పరిస్థితి. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ప్రాణాలు అరచేత పట్టి బిక్కు బిక్కుమనాల్సిందే. తిరిగి వస్తామన్న గ్యారంటీ లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంట్లోంచి బయటకెళ్లి తిరిగి రావడం ఏ మాత్రం నమ్మకం లేని కండీషన్స్. సరే ఇదంటే బతుకు పోరాటంలో తప్పదు. ఏదైనా పనిబడి, లేదా ఆఫీసు, స్కూలు, కాలేజీలకు వెళ్లి రావడం అంటే తప్పని సరి పరిస్థితి.
తమ తమ అభిమాన కథానాయకుడి సభలకు వెళ్లడం, ఆ హీరో సినిమా విడుదలైతే ప్రీమియర్ షోలకు వెళ్లడం, తమ క్రికెట్ హీరో కప్పు కొట్టాడన్న కోణంలో ఆయా విజయోత్సవాలకు వెళ్లడం.. వంటివి ఎంత చేటు తెస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇవేమైనా కూటికొచ్చేదా గుడ్డకు వచ్చేదా? అయినా సరే మనసు ఆగదు. అక్కడికెళ్లి ఏదో చూసెయ్యాలన్న తపన తాపత్రయం. వెంపర్లాట. వెరసీ ప్రాణాల మీదకు తెస్తోన్న పరిస్థితి.
ఆపై దైవ దర్శనాలు, కుంభమేళాలకు వెళ్లడం.. ఇదేం ఒకరొచ్చి చెప్పేది కాదు. ఆ మాటకొస్తే అక్కడికి వెళ్లాలన్న రూలు కూడా ఏమీ ఉండదు. టీవీల్లోంచి చూసినా సరిపోతుంది. ఆ దేవుడు ఇందుగలడు అందులేడన్న సందేహం లేదు. సర్వాంతర్యామి. ఇంట్లోంచి కొలిచినా ఇవ్వాల్సిన ఆశీస్సులు ఇస్తాడు. కానీ వంద ఏళ్ల తర్వాత వచ్చే కుంభమేళా అని, ఈ రోజు దర్శనం చేస్తే మనకు నేరుగా వైకుంఠ ప్రాప్తి అని.. ఇలా ఆయా ప్రవచన కర్తలు చెప్పింది విని.. వెళ్లిన వారి జీవితాలకు పుణ్యం రాక పోగా.. ఆయా కుటుంబాల్లో ఒక జీవితానికి సరిపడా విషాదం మాత్రం ఎదురవుతోంది.
వేలం వెర్రీ తనం తలకెక్కి.. పిచ్చి పైత్యం ఎక్కువయ్యి.. ఇదిగో ఇంతటి తీవ్ర విషాదాన్ని కొని తెచ్చుకోవడం మాత్రం నిజంగా చాలా చాలా బాధాకరం. ఇప్పటికి ఎన్ని ఘటనలు పునరావృతం అవుతున్నా.. వాటిని గ్రహించలేక పోవడం మాత్రం బాధాకరమేనంటారు పలువురు సామాజిక వేత్తలు.