బెంగళూరు వదిలేస్తే భారీ ప్రోత్సాహకాలు, రాయతీలు.. ఐటీ కంపెనీలు, ఉద్యోగులకు కర్నాటక బంపరాఫర్

ఇండియన్ సిలికాన్ వ్యాలీ  బెంగళూరు నగరం నుంచి టెక్ కంపెనీలను, టెకీలను బయటకు వెళ్లిపొమ్మంటోంది కర్నాటక ప్రభుత్వం. ఇందు కోసం ఏకంగా ఒక పాలసీనే రూపొందించింది.  ఈ పాలసీ మేరకు  స్టార్టప్‌లు, టెక్ కంపెనీలు రాష్ట్రంలోని టైర్ 2 నగరాలకు మారితే కోట్ల రూపాయల సబ్సిడీలు, పన్ను రాయితీలు ఆఫర్ చేస్తోంది సిద్దరామయ్య సర్కార్. ఇలా ఇచ్చే ప్రోత్సాహకాలలో గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకు 50 శాతం అద్దె రాయితీ, మూడు సంవత్సరాల పాటు 30 శాతం ఆస్తి పన్ను మినహాయింపు, 5 ఏళ్ల పాటు విద్యుత్ చార్జీలపై 100 శాతం మినహాయింపును అందిస్తోంది. అదే కాకుండా కంపెనీలకు ఫోన్, ఇంటర్నెట్ ఖర్చుల్లో  పాతిక శాతం, ఏఐ, బ్లాక్‌చెయిన్, క్వాంటం కంప్యూటింగ్ వంటి ఆధునిక రంగాల్లో పరిశోధన ఖర్చులపై 40 శాతం వరకు   రీఫండ్ పొందే అవకాశం కూడా కల్పిస్తున్నది.

ఈ విధానం టెక్ కంపెనీలను విశేషంగా ఆకర్షిస్తున్నట్లు సమాచారం. దీనిపై  టెక్ కమ్యూనిటీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  ప్రభుత్వం నూతన ఐటీ పాలసీలో భాగంగా  కంపెనీలు మైసూర్, మంగళూరు వంటి నగరాలకు మారేందుకు డబ్బు ఆఫర్ చేస్తోంది. ఈ పాలసీ కోసం కర్నాటక సర్కార్ ఐదేళ్లలో  దాదాపు 960 కోట్ల రూపాయలు వ్యయం చేయనుంది. ఈ పాలసీలో ఫస్ట్ కం ఫస్ట్ సెర్వ్ పద్ధతిగా ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే అవకాశాలుంటాయని అంటున్నారు.  ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కర్నాటక సర్కార్ వచ్చే నెల రెండో వారం నాటికి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బియాండ్ బెంగళూరు అన్న కర్నాటక సర్కార్ వ్యూహంలో లీవ్ బెంగళూరు కీలకం అంటున్నారు.   రాష్ట్రంలోని మైసూరు, మంగళూరు, హుబ్బిళి, ధారవాడ, బేలగావి, కలబురిగి, శివమెుగ్గ, దావణగెరె, తుమకూరు వంటి నగరాలు ఐటీ ఆధారిత కేంద్రాలుగా అభివృద్ధి చెందితే.. రాష్ట్రప్రగతికి దోహదమౌతాయని ప్రభుత్వం చెబుతున్నది. అలాగే కంపెనీలు రాష్ట్రంలోని ఇతర నగరాలకు తరలిపోవడం వల్ల బెంగళూరులో  ట్రాఫిక్, పొల్యూషన్ వంటి సమస్యలు  కూడా ఆటోమేటిగ్గా సాల్వ్ అయిపోతాయన్నది ప్రభుత్వ భావనగా తెలుస్తోంది.  

అలాగే బెంగళూరు నగరం విడిచి రాష్ట్రంలోని ఇతర నగరాలకు వెళ్లేందుకు ఎంచుకున్న ఐటీ ఉద్యోగులకు కూడా కర్నాటక ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా  బెంగళూరు నుంచి రాష్ట్రంలోని మైసూరు మైసూరు, మంగళూరు, కలబురగి వంటి ఇతర నగరాలకు మారేందుకు అంగీకరిస్తే వారికి 50 వేలు ప్రొత్సాహకంగా అందించాలని నిర్ణయించింది.

ఇందు కోసం ప్రభుత్వం 445 కోట్ల రూపాయలను కేటాయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విధానం కూడా అతి త్వరలో అమలులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఓ వైపు స్టార్టప్ లను తరలిపోవాలని కోరుతూనే.. వాటికి సిబ్బంది కొరత లేకుండా, రాకుండా ఉద్యోగులకు కూడా బెంగళూరు వదిలి వెళ్లిపోవడానికి సుముఖత చూపితే ప్రోత్సాహకం అందించాలని నిర్ణయించింది.   దేశం మొత్తంలోనే ఐటీ ఉద్యోగులకు అత్యంత ప్రీతిపాత్రమైన నగరంగా బెంగళూరు భాసిల్లుతోంది. అటువంటి నగరాన్ని వీడడానికి ఐటీ కంపెనీలు, ఐటీ ఉద్యోగులూ ఏ మేరకు ముందుకు వస్తారన్నది చూడాల్సిందే.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu