జగన్మోహన్ రెడ్డి తాజా సర్వే ఏం చెబుతోంది?

 

2014 సాధారణ ఎన్నికలకి ముందు సర్వేలను నమ్మి కాబోయే ముఖ్యమంత్రిని తానేనని ఊహాల పల్లకిలో ఊరేగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎలక్షన్స్ రిజల్ట్స్ కోలుకోలేని దెబ్బకొట్టాయి, జగన్ చేయించుకున్న అన్ని సర్వేల్లోనూ వైసీపీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి రానుందని తేలగా, తీరా ఫలితాలు వెలువడ్డాక బొక్కాబోర్లాపడాల్సి వచ్చింది, సర్వేలను గుడ్డిగా నమ్మి 2014 ఎన్నికల్లో దెబ్బతిన్న జగన్ మోహన్ రెడ్డి... మళ్లీ అదే సర్వేలను బేస్ చేసుకుని మరోసారి కీలక నిర్ణయం తీసుకోనున్నారనే టాక్ వినిపిస్తోంది.

2014 ఎన్నికల ముందు జగన్ చేయించుకున్న సర్వేలన్నీ వైసీపీకి అనుకూలంగానే ఉన్నాయని, అయితే చివరి నిమిషంలో పవన్ కల్యాణ్ రాకతో అది తారుమారైందని వైసీపీ నేతలంటున్నారు, అంతేగానీ జగన్ సర్వేల్లో ఎలాంటి తప్పిదం లేదని, ప్రజాభిప్రాయాన్ని కచ్చితంగా అంచనా వేశామని, అయితే టీడీపీతో పవన్ జతకట్టడంతో కొంచెం అటూఇటుగా ఫలితాలు తారుమారు అయ్యాయని అంటున్నారు, అది కూడా రెండు మూడు జిల్లాలోనే అది ఎక్కువగా కనిపించిందని, అయినప్పటికీ అధికారంలోకి వచ్చిన టీడీపీకి, ప్రతిపక్ష వైసీపీకి మధ్య కేవలం 5లక్షల ఓట్లు మాత్రమే తేడా అని గుర్తించాలంటున్నారు.

అయితే ఇప్పుడు చంద్రబాబుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది, టీడీపీ ప్రభుత్వ విధానాలపై జనం ఆగ్రహంతో ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు, జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న తాజా సర్వేలోనూ ఇదే తేలిందని, అందుకే రాజీనామా అస్త్రాన్ని మరోసారి బయటికి తీయాలని అనుకుంటున్నాడని చెబుతున్నారు, చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడానికి, ప్రత్యేక హోదా వంకతో ఉపఎన్నికలకు వెళ్లాలని జగన్ ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. 2014 ఎన్నికలకు ముందు వైఎస్ సెంటిమెంట్ తో ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉపఎన్నికల్లో ఘనవిజయం సాధించిన జగన్... మళ్లీ అలాంటి నిర్ణయం తీసుకుని బైపోల్స్ కి వెళ్లారో లేదో చూడాలి.