రాజీనామా చేస్తే... జగన్ వెంట వచ్చేదెంత మంది?

 

ప్రత్యేక హోదా కోసం దీక్ష చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి... చంద్రబాబును ఇరుకున పెట్టడానికి చివరిగా రాజీనామా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తారనే టాక్ కొద్దిరోజులుగా మీడియాలో హల్ చల్ చేస్తోంది, ప్రత్యేక హోదా సాధన కోసం తనతోపాటు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయించి జగన్ ఉపఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నాడని అంటున్నారు, అయితే జగన్ రాజీనామా అస్త్రాన్ని ప్రయోగిస్తే అది వైసీపీకి మైలేజ్ అవుతుందా? లేక మైనస్ అవుతుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఒకవేళ జగన్ రాజీనామా నిర్ణయం తీసుకుంటే ఎంతమంది ఆయన వెంట నడుస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, దాదాపు 20మందికి పైగా ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడానికి రంగంసిద్ధంగా ఉన్నారనే వార్తల నేపథ్యంలో రాజీనామా నిర్ణయం బెడిసికొట్టే అవకాశాలున్నాయని అంటున్నారు, పోనీ ఓ 20మంది మంది ఎమ్మెల్యేలు పోయినా, మిగిలే 47మంది అయినా రాజీనామాలు చేయడానికి ముందుకొస్తారో లేదోననే డౌట్ జగన్ ను వెంటాడుతోందంటున్నారు, ఒకవేళ 47మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎంపీలు రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్తే ఎంతమంది గెలుస్తారనేది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. పైగా డబ్బు తీయడనే పేరున్న జగన్ ను వైసీపీ ఎమ్మెల్యేలు నమ్మే పరిస్థితుల్లో లేరంటున్నారు.

అయితే మనీ, మీడియా మేనేజ్ మెంట్ బాగా తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం పది ఎమ్మెల్యేల సీట్లనైనా కచ్చితంగా ఎగరేసుకునిపోతారని, పైగా అధికార పార్టీ ఎత్తుల ముందు ప్రతిపక్షం ఆటలు సాగవని అంటున్నారు, అంతేకాదు అధికారంలో ఉన్న టీడీపీ...అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని వైసీపీని కోలుకోలేని దెబ్బతీసే అవకాశముందంటున్నారు. అదే కనుక జరిగితే వైసీపీ 67 నుంచి 30 సీట్లకు పడిపోయే ఛాన్సుందంటున్నారు. ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంటే మాత్రం... జగన్ పాచిక పారే అవకాశముందని, ఉపఎన్నికల్లో బంపర్ మెజార్టీలు సాధిస్తే టీడీపీ ప్రభుత్వం ఇరకాటంలో పడొచ్చని విశ్లేషకులు అంటున్నారు.