చైనాను దెబ్బకు దెబ్బ తీసిన భారత్

ఐక్యరాజ్యసమితిలో జరిగిన అవమానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌పై దాడికి కీలక సూత్రధారి జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను తీవ్రవాదిగా గుర్తించాలంటూ భారత్ ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రతిపాదనను చైనా తన వీటో పవర్‌తో అడ్డుకుంది. అంతేకాకుండా అతడు నిషేదం ఎదుర్కొనేంతటి తీవ్రవాది కాదంటూ చైనా తన పనిని వెనకేసుకు వచ్చింది. పైగా ఇలాంటి ప్రతిపాదనలు చేసేటప్పుడు సరైన కారణాలు చూపాలంటూ భారత్‌ను దెప్పిపొడిచింది. అజార్ తన దేశంలో హాయిగా విహరించేందుకు, తన ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించేందుకు కావల్సినంత స్వేచ్ఛను పాకిస్తాన్ అందిస్తోంది.

 

ఒకవేళ ఐక్యరాజ్యసమితిలో ఈ ప్రతిపాదన అమలై ఉంటే కనుక అజార్‌ తీవ్రవాది అయ్యేవాడు. అందుకే పాకిస్తాన్ కోరిక మేరకు చైనా అజార్‌ను కాపాడింది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాది అయిన అజార్‌ను కాపాడేందుకు చైనా, పాకిస్థాన్‌లు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది. ఉగ్రవాదం అణచివేతపై ఇలాంటి సంకుచిత దృక్పథాన్ని కనబరచడం ఏమాత్రం సరికాదని, ఉగ్రవాదాన్ని ఓడించేందుకు అంతర్జాతీయ సమాజం చూపాల్సిన సంకల్పాన్ని ఇది చూపడం లేదంటూ ఆక్రోశం వెల్లగక్కింది. చైనాకి సరైన గుణపాఠం నేర్పాలని, అవకాశం కోసం ఎదురు చూస్తున్న భారత్‌కి దొల్కన్ ఇసా రూపంలో పెద్ద పట్టు దొరికింది.

 

ముస్లింలు అధికంగా ఉండే చైనాలోని జింగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లో ముస్లింల హక్కుల కోసం తిరుగుబాటు జరుగుతుంది. వీరికి మద్ధతుగా వరల్డ్ విఘర్ కాంగ్రెస్ నాయకుడు దొల్కన్ ఇసా మద్దతు తెలుపుతున్నారు. చైనా ఉగ్రవాదిగా భావించే ఆ సంస్థ నాయకుడికి ఇప్పుడు భారత్ వీసా ఇచ్చింది. ఈ నెల 28న హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరిగే సదస్సు కోసం దోల్కన్ ఇసాకు భారత్ వీసా ఇస్తుందన్న వార్తలతో చైనాకు పుండు మీద కారం చల్లినట్టుగా మారింది. ఈ నేపథ్యంలో ఇసాకు భారత్ వీసా ఇవ్వడంపై డ్రాగన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇసా ఉగ్రవాది అని, అతనిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేసిందని, అతన్ని చట్టం ముందుకు తీసుకురావడానికి అన్ని దేశాలు సహకరించాలని కోరుతోంది. ఎదైనా తన దాకా వస్తేగాని తెలియదంటారు. ఇప్పుడు ఆ నొప్పి చైనాకి అర్థమైందన్న మాట.