హస్తంలో "కమలం" ఎందుకు వేలుపెడుతోంది ?

నిన్న గాక మొన్న పీఎఫ్ నిబంధనలు కఠినతరం చేస్తూ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమై దేశవ్యాప్తంగా కార్మిక లోకం భగ్గుమనడంతో  వెనక్కి తగ్గిన ప్రధాని నరేంద్రమోడీకి మరో షాక్ తగిలింది. ఉత్తరాఖండ్‌లో విధించిన రాష్ట్రపతి పాలనను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం కోసం ప్రవేశపెట్టిన ఆర్థికబిల్లుకు ఊహించని రీతిలో చిక్కులు ఏర్పడటంతో ఈ సంక్షోభం మొదలైంది. మాజీ సీఎం విజయ్ బహుగుణ శిబిరానికి తొమ్మిదిమంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు బిల్లుపై ఓటింగ్‌కు పట్టుబట్టిన బీజేపీతో చేతులు కలపడం..దానికి అంగీకరించకుండా మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందిందని స్పీకర్ ప్రకటించారు.

 

71 మంది సభ్యులు గల అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 36 కాగా, బీజేపీ సభ్యుల సంఖ్య 28. అధికారపక్షానికి ఆరుగురు సభ్యుల ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ మద్దతు కూడా ఉంది.  ఆర్ధిక బిల్లుకు అనుకూలంగా 32 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 36 వచ్చాయి. వీగిపోయిన బిల్లును ఆమోదం పొందిందంటూ స్పీకర్ ప్రకటించడం దేశచరిత్రలోనే తొలిసారి అని ఇది అనైతికమని కనుక ప్రభుత్వం రాజీనామా చేయాలని బీజేపీ కోరింది. దీనికి మద్దతు ప్రకటిస్తూ 9 మంది కాంగ్రెస్ సభ్యులు తిరుగుబాటు చేయడంతో  వీరిపై  స్పీకర్  అనర్హత వేటు వేశారు. ఈ పంచాయతీ గవర్నర్ వద్దకు చేరింది. సీఎం హరీశ్‌రావత్ బలనిరూపణ చేసుకోవాల్సిందిగా  గవర్నర్ సూచించారు.

 

బలపరీక్షలో తనకు మద్దతు ప్రకటించాలని కోరుతూ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ కెమెరాకు పట్టుబడటం చరిత్రలో ఇదే మొదటిసారన్నారు.అయితే మధ్యలో కేంద్రం జోక్యం తీసుకుని రాజకీయ డ్రామాకు తెరదించింది. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ విఫలమైందని ప్రకటిస్తూ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసింది. దీనికి అంగీకరించిన రాష్ట్రపతి ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని రద్దే చేసి అసెంబ్లీని సుప్తచేతనావస్థలో పెట్టారు. దీనిని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ఉత్తరాఖండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కేంద్రం తీరుపై మండిపడింది.

 

356 అధికరణంపై గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పునకు ఈ నిర్ణయం విరుద్ధమని పేర్కొంది. రాష్ట్రపతి పాలన అనేది చివరి అస్త్రంగా మాత్రమే ప్రయోగించాలి కాని ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను ఇలా తొలగించడం తొందరపడటమనేది పౌరుల హృదయాలపై మూర్ఖంగా దెబ్బ కొట్టడమే. రాష్ట్రప్రభుత్వాలను వదిలించుకోవడం, మార్చేయడం లేదా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టడం...స్తంభింపజేయడం లేదా రద్దు చేయడం ఏదైనా కావచ్చు. అంతిమంగా జరిగేది మాత్రం ప్రజాస్వామ్యాన్ని నేలకూల్చడమేనంటూ కేంద్రానికి మొట్టికాయలు వేసింది. ఉత్తరాఖండ్‌లో రాజకీయ సంక్షోభం, రాష్ట్రపతి పాలన విధించడానికి బీజేపీ మైండ్ గేమ్‌లో ఒక పార్ట్.

 

అరుణాచల్ ప్రదేశ్‌లో తలెత్తిన ఇలాంటి సంక్షోభం, జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ కసరత్తు చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. రాజ్యసభలో సంఖ్యాబలం లేని ఎన్డీఏ ప్రభుత్వానికి కీలక బిల్లుల ఆమోదం కష్టంగా మారింది. సభలో సంఖ్యాబలాన్ని పెంచుకోవాలంటే రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల సంఖ్య పెరగాలి. ఇప్పటికిప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాలు లేకుండా బీజేపీ గెలవలేదు. అందుకే ప్రతిపక్ష కాంగ్రెస్ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో సంక్షోభం సృష్టించి వీలైతే ముందస్తు ఎన్నికలు జరిగిలా చూస్తే లాభపడాలని బీజేపీ వ్యూహకర్తల ప్లాన్. నెలల వ్యవధిలో రెండు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో తిరుగుబాట్లు, రెబల్ ఎమ్మెల్యేలకు బీజేపీ మద్దతు, రాష్ట్రపతి పాలన..బీజేపీ గేమ్ ప్లాన్‌లో భాగంగా అర్థం చేసుకోవచ్చు.