‘వేలం’ వెర్రి తలలు!?

ఉత్త‌ర ప్ర‌దేశ్ లో రెండు ల‌క్ష‌ల రూపాయ‌లను ఎన్నిక‌ల ప్ర‌చార ఖ‌ర్చుకు తీస్కెళ్లిన అభ్య‌ర్ధి ఇర‌వై వేల రూపాయ‌ల‌ను ఇంటికి తెచ్చారంటే నమ్మశక్యంగా లేదు కదూ!  కానీ అది నిజం. లాలాగే..   ఓ అభ్య‌ర్ధి    ఎన్నార్సీ కేసుల‌పైన పోరాటం చేసి జైలుకు వెడితే.. ఆయ‌న త‌రఫున ఆయన భార్య‌, త‌ల్లి ఎలాంటి  ఖ‌ర్చు లేకుండా  ప్ర‌చారం  చేశారు. ఆ ఎన్నికలో ఆయన విజయం సాధించారు.  

ఇక ఇటీవల ఇటీవల బీహార్ ఎన్నిక‌ల్లో అలీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం  నుంచి గాయిని మైథిలీ ఠాగూర్ విజయం  కూడా దాదాపు ఇలాంటిదే.   ఉత్త‌రాదిలో ఎన్నిక‌లంటే ఎమంత ఆస‌క్తిక‌రం కాదు. ఆపై అదేమంత కాస్ట్లీ  ఇష్యూ కూడా కాదు. ఖ‌ర్చు అస‌లే  ఉండ‌ద‌ని అంటాయి అక్కడి వారు. 

అయితే దక్షిణాదిలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి పరిస్థితులు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో స‌ర్పంచ్ ప‌దవికి  కూడా భారీ ఎత్తున  ఖ‌ర్చు పెట్టేస్తున్నారు. స‌ర్పంచ్ ప‌ద‌వుల వేలంలో ఒక  పంచయతీలో  స‌ర్పంచ్ సీటు ఏకంగా కోటి రూపాయ‌లు ప‌లికిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్ధం చేసుకోవచ్చు.  ఔను  మహబూబ్​నగర్​ జిల్లా, హన్వాడ మండలం, టంకర గ్రామంలో సర్పంచి పదవి కోసం  కోటి వెచ్చిస్తానని ఒక వ్యక్తి ప్రకటించినట్లు ప్రచారం జరిగింది.  కోటి రూపాయ‌ల‌కు స‌ర్పంచ్ ప‌ద‌వి అంటూ సోష‌ల్ మీడియాలో ఈ ఊరి  పేరు తెగ  మార్మోగిపోయింది. 

అయితే వాస్తవమేంటంటే.. ఎన్నిక‌ల్లో వృధా ఖ‌ర్చు పెట్ట‌డం బ‌దులు ఊళ్లోని ఆంజేయస్వామి వారి ఆల‌యాన్ని  ఎవ‌రైతే పూర్తి చేస్తారో వారినే గ్రామ  స‌ర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఆ గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు.  ఆ ఒక్క ఆల‌యానికే సుమారు 60, డెబ్బై ల‌క్ష‌ల మేర ఖ‌ర్చు అవుతుంద‌ని తేలడంతో.. ఆల‌య ఖ‌ర్చుల‌తో పాటు ఊరిలోని ఇత‌ర‌త్రా ప‌నుల లెక్క కూడా వేసి కోటి రూపాయ‌ల ని తేల్చారు.  అది పక్కన పెడితే సర్పంచ్ పదవుల వేలం తెలంగాణలో ఒక వెర్రిలా మారిపోయింది.  జోగులాంబ గద్వాల జిల్లా, గట్టు మండలం, మిట్టదొడ్డి సర్పంచి పదవిని ఓ సీడ్​ ఆర్గనైజర్​  రూ.90 లక్షలకు, ఇదే మండలం గోర్లాఖాన్​దొడ్డిలో రూ.57 లక్షలకు,  లింగాపురం గ్రామంలో రూ.34 లక్షలకు వేలంలో సర్పంచ్ పదవులను ఏకగ్రీవం చేసుకున్నారు.  ఇంకా  గద్వాల మండలం, కొండపల్లిలో రూ.60 లక్షలకు నల్లదేవునిపల్లిలో.. రూ.45 లక్షలకు వేలం పాట ద్వారా సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. 

అదే విధంగా మల్దకల్​ మండలం సద్దలోనిపల్లి సర్పంచి పదవి వేలంలో  రూ.42 లక్షలు పలికిందంటున్నారు. వీరాపురంలో రూ.50 లక్షలు,   ఖమ్మం జిల్లా, కామేపల్లి మండలం, జోగ్గూడెం రూ.20 లక్షలకు సర్పంచ్ పదవులను వేలంపాటలో దక్కించుకున్నారు.  పదవుల మోజే ఈ ‘వేలం వెర్రి’కి కారణమంటున్నారు. అంత వరకూ కష్టపడి సంపాదించుకున్నది మొత్తం ధారపోసి మరీ పదవులు దక్కించుకోవడానికి పడుతున్న పోటీ విస్మయం గొలపక మనదు. వాస్తవంగా చూస్తే సర్పంచ్ పదవి పెద్ద పవర్ ఉన్న పదవి కూడా కాదు. అయితే దాని కోసం ఇంత హంగామా, తాపత్రేయం, పోటీ ఎందుకు అని ప్రశ్నించే వారూ ఉన్నారు.  

స‌ర్పంచ్ ప‌ద‌వుల విష‌యంలోనే  ఇంత వేలం వెర్రి ఉంటే.. ఇక కార్పొరేటర్, ఎమ్మెల్యే పదవులకు ఎంతెంత ఖర్చు పెట్టాల్సి వస్తుందోఅన్న చర్చ జరుగుతోంది.  ఈ వేలం ‘వెర్రి’ చూస్తుంటే రాజకీయాలు అవినీతి మయంగా మారడానికి కారణమేమిటో ఇట్టే అవగతమౌతుందంటున్నారు పరిశీలకులు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu