టీఆర్ఎస్‌లో మసకబారుతున్న హరీశ్ ప్రభ

తెలంగాణ రాష్ట్ర సమితి..ఈ పేరు చెప్పగానే టక్కున గుర్తుచ్చేది కేసీఆర్. ఆయన తర్వాత  కేటీఆర్, హరీశ్, కవిత కళ్లేదుట మెదులుతారు. అయితే టీఆర్ఎస్‌లో కేసీఆర్ తర్వాత ఎవరు అనే అంశంపై తెలుగు ప్రజలు ప్రతి రోజూ చర్చించుకుంటూనే ఉంటారు. వారసత్వ రాజకీయాలు రాజ్యమేలే తెలుగు రాష్ట్రాల్లో తండ్రి తర్వాత కొడుకే అనే ధోరణి ఎక్కువగా ఉంటుంది. దీనిని బట్టి కేసీఆర్ వారసుడు కేటీఆరే అవుతారు కాని ఇక్కడ పోటీలో నిలిచారు కేసీఆర్ మేనల్లుడు, మంత్రి హరీశ్ రావు. టీఆర్ఎస్‌ స్థాపించిన కొత్తలో "నేనూ.. నా భార్య మాత్రమే ఇక్కడ ఉన్నాం. నా కొడుకు, కూతురు అమెరికాలో ఉన్నారు. నాకు ఏ బాదరబందీలేదు. తెలంగాణ వచ్చే వరకు కొట్లాడుతా'' అని చెబుతుండేవారు కేసీఆర్. అప్పట్లో మావయ్యకి చేదోడువాదోడుగా ఉంటూ అన్నీతానై వ్యవహరించారు హరీశ్ రావ్.

 

  2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పెట్టుకున్న టీఆర్ఎస్ 26 అసెంబ్లీ, 5 లోక్‌సభ స్థానాల్లో గెలిచింది సిద్ధిపేట అసెంబ్లీ, కరీంనగర్ లోక్‌సభ స్ధానాల నుంచి గెలిచిన కేసీఆర్..సిద్ధిపేట స్ధానానికి రాజీనామా చేశారు. అక్కడ హరీశ్‌ను నిలబెట్టి గెలిపించడంతో పాటు మంత్రి పదవి ఇప్పించిన కేసీఆర్...తన వారసుడు మేనల్లుడేనని చెప్పకనే చెప్పారు. దీంతో పార్టీ శ్రేణుల్లో హరీశ్ గట్టి పట్టు సాధించారు. అయితే కేటీఆర్, కవిత రంగ ప్రవేశంతో హరీశ్‌కు వారసత్వ పోరు మొదలైంది. అది అలా నడుస్తుండగానే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. చివరికి రాష్ట్రం రెండు ముక్కలై 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. ఉద్యమ పార్టీగా మొదలైన టీఆర్ఎస్ లక్ష్యం నెరవేరి రాజకీయ పార్టీగా అవతరించింది.

 

2014 ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పక్షాన నిలిచి అధికారాన్ని అందించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి హరీశ్, కేటీఆర్‌లకు తన కేబినెట్‌లో స్థానం కల్పించారు. కుమార్తె కవితను నిజామాబాద్ ఎంపీని చేశారు. పైకి వీరంతా బాగానే ఉన్నప్పటికి లోలోపల వారసత్వ యుద్ధం జరుగుతూనే ఉంది. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ నెంబర్ 2 పోజిషన్ కోసం కేటీఆర్, హరీశ్‌ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో అన్నీతానై పార్టీని గెలిపించారు కేటీఆర్. దీంతో ఇలు పార్టీలోనూ, ప్రజల్లోనూ ఆయన పేరు మారు మోగిపోయింది. ఆయనే కేసీఆర్ వారసుడు అనే బలమైన నిర్ణయానికి పార్టీ శ్రేణులు వచ్చేశాయి. దీనికి సీఎం కూతురు కవిత తోడయ్యారు. కేసీఆర్ రాజకీయ వారసుడు కేటీఆరేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

ఇదే సమయంలో సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. ఇక్కడ టీఆర్ఎస్ విజయం ఏకపక్షమే అని అంతా ఊహించారు. పైగా హరీశ్ అంటే సిద్ధీపేట..సిద్ధీపేట అంటే హరీశ్ అనే నమ్మకం కూడా ఉండటంతో కారు దూసుకెళ్తుందనుకున్నారు. అయితే వాస్తవంలో జరిగింది వేరు. 34 వార్డులకు గానూ 22 వార్డులను మాత్రమే టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. గతంలో అంతగా ప్రభావం లేని హైదరాబాద్, ఖమ్మం, వరంగల్‌లో సునాయాసంగా గెలిచిన టీఆర్ఎస్, పార్టీ బలంతో పాటు తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువగా ఉన్న సిద్ధిపేట పట్టణంలో పన్నెండు వార్డులను కోల్పోవడాన్ని గులాబీ దండు జీర్ణించుకోలేకపోతోంది. సీఎం కేసీఆర్ కూడా దీనిపై అసంతృప్తిగా ఉన్నారు. దీనిపై అన్ని వేళ్లూ హరీశ్‌ వైపే చూపెడుతున్నాయి. ఇక అక్కడ నుంచి హరీశ్ ప్రభ మసకబారుతూ వస్తోంది.  ఆయనకు పార్టీ కార్యాకలాపాల్లో అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ప్రతిష్టాత్మక ప్లీనరి ఏర్పాట్లతో పాటు త్వరలో జరగనున్న పాలేరు ఉపఎన్నికకు కేటీఆర్‌ను ఇన్‌ఛార్జిగా నియమించారు. ఈ నిర్ణయంతో హరీశ్ స్థానం ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు.