ఐ బొమ్మ సినిమాలను...చాటుగా ఎలా షూట్ చేస్తుందో తెలుసా!?
posted on Oct 5, 2025 12:24PM

నువ్వీ తప్పెందుకు చేస్తున్నావ్ అంటే.. మీరంతా ఇన్నేసి తప్పులు చేస్తున్నారు కాబట్టి! అన్నాట్ట ఒక నిందితుడు.. సరిగ్గా అలాగే ఉంది ఐ బొమ్మ వ్యవహారం. కావాలంటే చూడండీ.. చిన్న సినిమాలే కాదు పెద్ద పెద్ద సినిమాల పాలిటి కూడా మెయిన్ విలన్ గా మారిపోయిందీ బొమ్మ ఉరఫ్ బెప్పం టీవీ పైరసీ సైట్.
ఒక మనిషి ఖర్చు చేసే వినోద వ్యయాన్ని దాదాపు తగ్గించేసిన ఐ బొమ్మ.. సినిమా వాళ్లను మాత్రం దారుణంగా దెబ్బ తీస్తోంది. ఈ సినిమా బాగుందన్న పాజిటివ్ టాక్ వచ్చేలోపు ఇందులో టీజర్ వేసి మరీ రిలీజ్ చేసేస్తున్నారు. రీసెంట్ గా ఓజీని కమింగ్ సూన్ అని చెప్పి మరీ వదిలారు. కనీసం ఒకటీ రెండు రోజుల టైం కూడా ఇవ్వకుండా ఈ పైరసీ సైట్లో ప్రతి సినిమా ప్రత్యక్షమవుతోంది.
ఈ పైరసీ సినిమాలను వీరెలా తీస్తారో కూడా వివరించారు పోలీసులు. స్టాండ్ బై యాప్ ని తమ ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకుంటారు.. సినిమా ఎలా తీసినా సరే అది సరి చేసి ఒక వీడియో రూపొందించి డెలివరీ చేస్తుంది. ఎక్స్ ట్రా మనీ కోసం కిరణ్ వంటి వారు ఈ పని చేస్తుంటారని చెబుతున్నారు పోలీసులు.
ఇటీవల పట్టుబడ్డ ఏసీ టెక్నీషియన్ కిరణ్ చేస్తోంది ఇదేనంటారు పోలీసులు. వీర్ని క్యామ్ కాడర్స్ అంటారు. అమలాపురానికి చెందిన కిరణ్ ఏసీ టెక్నీషియన్ గా పని చేస్తూ మరింత ఎక్కువ డబ్బు అవసరానికై ఈ ఫీల్డ్ లోకి వచ్చాడని చెబుతారు పోలీసులు. ఇతడ్ని ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులకు ఈ మొత్తం నెట్ వర్క్ ఎలా నడుస్తుందో అర్ధమైం పోయింది. పోలీసులు తమపై నిఘా పెట్టారని తెలిసిన ఐ బొమ్మ ఇటీవల ఒక మెసేజ్ రిలీజ్ చేసింది.
ఇందులో ప్రధాన చర్చనీయాంశం ఏంటంటే హీరోలకు అంతంత రెమ్యునరేషన్లు ఎందుకన్నది. నిజానికి ఒక సినిమాలో సగం క్యాస్టింగ్ కి సరిపోతుంది. అందులోనూ సగం హీరో కి వెచ్చించాల్సి వస్తుంది. ఇక్కడ ఐబొమ్మ వాడికి తెలియాల్సింది ఏంటంటే, హీరో ఆ సినిమాకు మెయిన్ మార్కెట్ లీడర్.
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అంటూ గతంలో.. పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ అంటూ ఇప్పుడూ ఒక మార్కెట్ విస్తరణ జరిగింది. ఈ మార్కెట్ ఆయా నటుల సినిమాల కలెక్షన్లను బట్టీ ఏర్పడుతుంది. చిరంజీవికి మెగా స్టార్ అనే బిరుదు ఊరకే ఇవ్వలేదు.. ఆయన సినిమా కలెక్షన్లను బట్టీ ఇచ్చారు.
ఇప్పుడంటే బాలకృష్ణకు నట సింహ అంటూ ఏవో బిరుదులున్నాయి. కానీ, గతంలో బాలకృష్ణకు బాక్సాఫీస్ బోనాంజా అనేవారు. అంటే బాలకృష్ణ సినిమాగానీ హిట్ టాక్ తెచ్చుకుంటే ఇక ఆ కలెక్షన్ల వరద అంత తేలిగ్గా ఆగదు. ఇప్పటికీ కొన్ని థియేటర్లలో బాలయ్య సినిమాలు నాన్ స్టాప్ గా నడుస్తుంటాయంటే అతిశయోక్తి కాదేమో. ఇక నాగార్జున, వెంకటేష్ సంగతి సరే సరి. నాగార్జున- శివ వంటి ప్రయోగాత్మక చిత్రాకలు కేరాఫ్ అయితే, వెంకటేష్- చంటి తరహా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి పెట్టింది పేరు.
ఇక ప్రెజంట్ జనరేషన్ హీరోలకూ ఒక మార్కెట్ ఉండటం ఆ మార్కెట్ ప్రకారమే.. వారి వారి రెమ్యునరేషన్లు ఇవ్వడం జరుగుతోంది. ప్రొడ్యూసర్లు కూడా ఏం ఊరకే డబ్బులు ఇవ్వరు. వారికున్న మార్కెట్ పరిధిని బట్టీ పారితోషకాలుంటాయి.
చిరంజీవి చెప్పడం కూడా అదే.. జనం థియేటర్ల బాట పట్టాలంటే ఓటీటీలో తెలుగు డబ్ అవుతోన్న హాలీవుడ్ రేంజ్ తరహా మూవీస్ మనమూ తీయాలనే ఇంత ఖర్చని చెప్పుకున్నారాయన. తానేదో పెద్ద తెలుగు సినిమా ఫీల్డ్ ని ఉద్దరించడానికి వచ్చిన రిఫార్మర్ లా.. ఈ ఐ బొమ్మ హ్యాండ్లర్ మెసేజీలు పాస్ చేయడం. చేసిన తప్పుకు బదులు చెప్పమంటే హీరోల పారితోషకాలను నిలదీయడం.. సరికాదంటారు పోలీసులు.. అది వాళ్లు వాళ్లు చూసుకుంటారు. మధ్యలో వీళ్లెవరని అంటారు అధికారులు.
1957- కాపీ రైట్ చట్టం ప్రకారం పైరసీ ఒక నేరం. 2019లో పైరసీ రాకాసిని ఎదుర్కోడానికి ఈ చట్టాన్నిసవరించారు కూడా. దీని ప్రకారం చట్టవిరుద్ధంగా సినిమా రికార్డింగ్ చేయడం, పంపిణీ చేయడం వంటివి తీవ్ర స్తాయి నేరాలుగా పరిగణిస్తారు. పైరసీ చేసినట్టు రుజువైతే ఎలాంటి శిక్షలు ఉంటాయో చూస్తే.. మూడేళ్ల పాటు జైలు శిక్ష, భారీ జరిమానా విధిస్తారు. నాలుగేళ్లుగా పైరసీ చేస్తోన్న కిరణ్ ద్వారా ఇండస్ట్రీకి సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల ఆర్ధిక నష్టం సంభవించిందని అంచనా వేస్తున్నారు. కాబట్టి ఇతడికి, ఇతగాడి వెనకున్న ఐబొమ్మ నెట్ వర్క్ కి పెద్ద ఎత్తున జరిమానాతో పాటు శిక్ష కూడా పడే అవకాశం కనిపిస్తోంది.