అమెరికా కర్మాగారంలో పేలుడు.. 19 మంది మృతి
posted on Oct 11, 2025 11:05AM

అమెరికాలో సంభవించిన భారీ పేలుడులో కనీసం 19 మంది మరణించారు. టేనస్సీ రాష్ట్రంలోని ఓ పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సైనిక, అంతరిక్ష, వాణిజ్య రంగాలకు అవసరమైన పేలుడు పదార్థాలను ఉత్పత్తి చేసే ఈ కంపెనీలో జరిగిన ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రమాదం జరిగిన తర్వాత చాలా మంది కార్మికుల ఆచూకీ తెలియడం లేదు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతున్నది. పేలుడు ధాటికి సమీపంలో ఉన్న నివాసాలు బీటలు వారాయి. ప్రాణభయంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇలా ఉండగా పేలుడు ధాటికి కర్మాగారం భవనం పూర్తిగా నేలమట్టమైంది. పేలుడు తీవ్రత కారణంగా సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురౌతున్నాయి. కాగా పేలుడుకు కారణాలేంటన్నది వెంటనే తెలియరాలేదు. దర్యాప్తు చేపట్టామని అధికారులు చెబుతున్నారు.