నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్దన్‌ రావు అరెస్ట్

 

నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్ధన్‌రావును గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకొన్నరు. సౌతాఫ్రికా నుంచి విజయవాడ వస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు.. గన్నవరం విమానాశ్రయంలో ఏ1గా ఉన్న జనార్ధన్‌రావును అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశ‌ పెట్టే ఛాన్స్ ఉంది. 

ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. అద్దెకు తీసుకున్న ప్రదేశంలో నకిలీ మద్యం ఉత్పత్తి జరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు ఇటీవల దాడులు నిర్వహించి రూ.1.75 కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్‌రావు సోదరుడు జగన్మోహన్‌రావును ఇప్పటికే అరెస్ట్‌ చేశారు.

దర్యాప్తులో ములకల చెరువులో తయారైన నకిలీ మద్యం విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నాలో ఏర్పాటు చేసిన బాట్లింగ్‌ యూనిట్‌లో ప్రాసెసింగ్‌ చేసినట్లు పోలీసులు నిర్ధరించారు. అలాగే, ఇబ్రహీంపట్నం ఏఎన్‌ఆర్‌ బార్‌ వద్ద నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేసి విక్రయాలు కూడా నిర్వహించినట్లు వెల్లడైంది.

గోల్డ్‌ అడ్మిరల్‌, క్లాసిక్‌ బ్లూ, కేరళ మాల్ట్‌, మంజీరా వంటి ప్రముఖ బ్రాండ్ల ఒరిజినల్‌ లేబుళ్లతో వేల సంఖ్యలో నకిలీ క్వార్టర్‌ బాటిళ్లను నింపినట్టు పోలీసులు గుర్తించారు. మూతలు బిగించే యంత్రాలు, హోలోగ్రామ్‌ స్టిక్కర్లు, కార్టన్‌ బాక్స్‌లు కూడా అక్కడ నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం అక్కడి నుంచి బెల్ట్‌షాపులు, మద్యం దుకాణాలకు తరలిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. జనార్దన్‌రావు తన సోదరుడు జగన్మోహన్‌రావు సాయంతో ఈ దందా నడిపించినట్టు విచారణలో పోలీసులు వెల్లడించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu