కడప పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాలకు ఏర్పాట్లు
posted on Oct 10, 2025 8:46PM

మత సామరస్యానికి ప్రతీక అయిన కడప అమీన్ పీర్ దర్గా (పెద్దదర్గా) ఉరుసు మహోత్సవాలు నవంబర్ 4 నుంచి 10 వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ ఉత్సవాలను ను అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ముందస్తు ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. ఈ ఉత్సవాలను విజయ వంతం చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం కడప అమీన్ పీర్ దర్గా లోని ముషాయిరా హాల్ నందు అమీన్ పీర్ దర్గా ఉత్సవాల నిర్వహణ, ముందస్తు ప్రచారం ఏర్పాట్లపై అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి జనాబ్ ఆరిఫ్ ఉల్లా హుసేని అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే ఆర్. మాదవి రెడ్డి, కడప నగర మేయర్ ముంతాజ్ బేగం, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ "మన కడపలో మన పండుగ"గా భావించే కడప అమీన్ పీర్ దర్గా ఉత్సవాలను అందరూ కలసి కట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని అధికారులు, ప్రజా ప్రతినిధులను కోరారు. ఉరుసు మహోత్సవాలకు కొన్ని రోజుల ముందుగానే అన్నిరకాల ఉత్సవ ఏర్పాట్లను ఒక్కొశాఖ జిల్లా అధికారుల పర్యవేక్షణలో నిర్వహించడం జరుగుతుందన్నారు.
పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేయాలని ఎక్కడా ఎలాంటి సంఘటనలకు తావివ్వకుండా గట్టి భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. కడప నగర మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పరిశుభ్రత ఏర్పాట్లను చూడాలని ఆదేశించారు.గతంలో కంటే ఈ సంవత్సరం ఉరుసు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రజలందరూ కుటుంబ సమేతంగా హాజరై ఉత్సవాలను దిగ్విజయం చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.
*వాలంటీర్ల ఏర్పాటు
ఈ ఏడాది ఉరుసు మహోత్సవాలకు వచ్చే భక్తులకు సౌలభ్యం, సమాచారం కోసం రైల్వేస్టేషన్, బస్ స్టేషన్, ఎయిర్ పోర్టులలో దర్గా కమిటీ తరపున వాలంటీర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అధిక సంఖ్య లో వైద్య సిబ్బందిని వైద్యాధికారులను నియమించి ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే 108, అంబులెన్స్ తదితర వాహనాలతో పాటు అత్యవసర మందులు కూడా అందుబాటులో ఉంచాలన్నారు.అన్ని శాఖల సమన్వయంతో అమీన్ పీర్ దర్గా ఉత్సవాలను ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలన్నారు.
ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే మాధవీ రెడ్డి మాట్లాడుతూ శతాబ్దాల నాటి చరిత్ర కలిగిన ప్రఖ్యాత అమీన్ పీర్ దర్గా ఉత్సవాలను మత సామరస్యాన్నిప్రతిబింబించేలా ఘనంగా నిర్వహించాలని కోరారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ అమీన్ పీర్ దర్గా ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్ల ను చేయడం జరుగుతుందని, నిర్దేశించిన ప్రాంతాల్లో సీసీ కెమెరా లను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. అదనపు భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం ఉరుసు ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి.. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి,ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, దర్గా పీఠాధిపతులలు, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ప్రజాప్రతినిధులతో కలిసి ఉరుసు మహోత్సవ పోస్టర్లను ఆవిష్కరించారు.