అనిల్ అంబానీకి ఈడీ షాక్
posted on Oct 11, 2025 3:40PM
.webp)
ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీకి ఈడీ షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన రిలయన్స్ పవర్ లిమిటెడ్ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ మేనేజర్ (సీఎఫ్ వో) అశోక్ కుమార్ పాల్ ను ఈడీ శనివారం (అక్టోబర్ 11) అరెస్టు చేసింది. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయనను అదుపులోనికి తీసుకున్నట్లు తెలుస్తోంది.
రూ. 68 కోట్ల నకిలీ బ్యాంక్ గ్యారంటీకి సంబంధించి ఈ అరెస్టు జరిగినట్లు చెబుతున్నారు. ఏడేళ్లుగా రిలయన్స్ పవర్‌లో సీఎఫ్‌వోగా పనిచేస్తున్న అశోక్ పాల్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈసీఐ)కి రూ.68 కోట్లకు పైగా విలువైన నకిలీ బ్యాంక్ గ్యారెంటీని సమర్పించారని ఈడీ ఆరోపించింది. ఈ నకిలీ గ్యారెంటీలను నిజమైనవిగా నమ్మించేందుకు, ఎస్‌బీఐ, పీఎన్‌బీ వంటి ప్రముఖ బ్యాంకుల పేర్లను పోలిన ఫేక్ ఈమెయిల్ డొమైన్లను సృష్టించి ఉపయోగించినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ పేర్కొంది. ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో అసలు ఉనికిలోనే లేని ఓ విదేశీ బ్యాంక్ బ్రాంచ్ నుంచి కూడా గ్యారెంటీ పత్రాలు సృష్టించినట్లు ఈడీ గుర్తించింది.
కేవలం కాగితాలపై మాత్రమే ఉన్న ఈ కంపెనీ ద్వారానే రిలయన్స్ పవర్ తరఫున నకిలీ గ్యారెంటీలను ఏర్పాటు చేసినట్లు తేలింది. ఈ ఆరోపణలకు సంబంధించి బిస్వాల్ కంపెనీ డైరెక్టర్‌ను గత ఆగస్టులోనే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు రూ.17,000 కోట్లకు పైగా బ్యాంకు రుణాలను దారి మళ్లించాయన్న ఆరోపణలపై ఈడీ విస్తృత దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగానే తాజా అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది.