కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
posted on Oct 1, 2025 3:06PM

దసరా సందర్బంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్డీయే సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశం అనంతరం ఉద్యోగులకు చెల్లించే కరవు భత్యం ప్రకటన చేసే అవకాశం ఉంది. మొత్తం డీఏ 55 శాతం నుంచి 58 శాతానికి చేరుకుంటుంది. ఈ ఏడాది డీఏ పెంపు ఇది రెండోసారి కావడం విశేషం.
ఇప్పటికే మార్చిలో 2 శాతం పెంచిన ప్రభుత్వం, తాజా పెంపును జూలై 1 నుంచి అమలు చేయనుంది. దీంతో మూడు నెలల బకాయిలు కూడా ఉద్యోగులకు అందనున్నాయి. ఈ నిర్ణయం వల్ల కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.
సాధారణంగా వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా ప్రభుత్వం ఏడాదికి రెండు సార్లు డీఏను సవరిస్తుంది. ద్రవ్యోల్బణం భారాన్ని తగ్గించేందుకు ఇచ్చే ఈ భత్యం తాజా పెంపుతో లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఉపశమనం కలిగించనుంది. ఉదాహరణకు, రూ.60,000 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి ప్రస్తుతం డీఏగా రూ.33,000 వస్తే, ఇప్పుడు అది రూ.34,800కి పెరుగుతుంది.
ఇకపై వేతన సవరణ కోసం ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ కమిషన్ సిఫార్సుల ఆధారంగా భవిష్యత్తులో జీతాలు, అలవెన్సులపై స్పష్టత రానుంది. 2026 జనవరి 1 నుంచి ఈ సిఫార్సులు అమలులోకి వచ్చిన తర్వాత, ప్రస్తుత డీఏ బేసిక్ పేలో విలీనం చేయబడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.