నెల్లూరులో స్మార్ట్ బజార్.. వర్చువల్ గా ప్రారంభించిన చంద్రబాబు
posted on Oct 12, 2025 10:52AM
.webp)
మంత్రి పొంగూరు నారాయణను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అభినందించారు. మెప్మా, డ్వాక్రా గ్రూపుల నుంచి లక్ష మంది యువ పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందన్న చంద్రబాబు.. ఇందులో భాగంగా రాష్ట్రంలోనే మొదటిసారిగా నెల్లూరులో నిరుపేదలైన మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది వారి జీవితాల్లో వెలుగులు నింపిన మంత్రి నారాయణ కార్యాచరణ చిరస్మరణీయమని సీఎం కొనియాడారు. నెల్లూరులోని మైపాడు రోడ్డు వద్ద ఏడు కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసిన 30 కంటైనర్లలో 120 షాపులను ముఖ్యమంత్రి కార్యాలయం నుండి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతున్నదని అందులో భాగంగా తొలి అడుగు నెల్లూరులో పడిందన్నారు. 120 మంది చిరు వ్యాపారులను ఎంటర్ప్రైన్నుర్లుగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణను, నెల్లూరు జిల్లా అధికారులను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. చాలామంది వీధి వ్యాపారులను సొంత షాప్ యజమానులుగా తీర్చిదిద్దే విధంగా చర్యలు చేపట్టడాన్ని ఆయన ప్రశంసించారు. స్మార్ట్ స్ట్రీట్ బజారు ఏర్పాటు వల్ల నెల్లూరుకు మంచి లుక్ వచ్చిందనీ, కార్పొరేట్ సిటీలో లాగా కనపడుతున్నదనీ సీఎం అన్నారు. పర్యావరణ నిబంధనలను పాటిస్తూ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అన్ని వసతులతో అన్ని రకాల వస్తువులు దొరికే విధంగా షాపులు ఏర్పాటు చేయడాన్ని అభినందించారు. పారదర్శకతతో షాపులు ఏర్పాటు చేసి వారికి చెన్నై వంటి మహానగరాలలో శిక్షణ ఇప్పించడం గొప్ప విషయమన్నారు.
మంత్రి నారాయణ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమంలో భాగంగా మైపాడు రోడ్డులో 120 షాపులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీని వల్ల 120 మందికి ప్రత్యక్షంగా 500 మందికి పైగా పరోక్షంగా ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. ఎన్నిక చేయబడిన చిరు వ్యాపారస్తులకు చెన్నైలోని బర్మా బజార్లో శిక్షణ ఇప్పించినట్లు చెప్పారు. స్మార్ట్ షాపుల కాంప్లెక్స్లో అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని ఎనిమిది కార్పొరేషన్లు 123 మున్సిపాలిటీలలో ఇలాంటి షాపులు ఏర్పాటు చేస్తామని నారాయణ చెప్పారు.
జిల్లా కలెక్టర్ శ్రీ హిమాన్షు శుక్లా, మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ నందన్, ఆర్టీసీ జోనల్ మేనేజర్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.