అంచనాలకు భిన్నంగా బీహార్ ఎగ్జిట్ పోల్స్!

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎప్పుడో ఒకప్పుడు తప్పుతుంటాయ్ తప్ప.. చాలా వరకు ఎగ్జిట్ పోల్స్.. ఎగ్జాక్ట్ పోల్స్‌కు దగ్గరగానే ఉంటాయి. బీహార్‌లో మరోసారి ఎన్డీయే అధికారం చేపట్టబోతోందని వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. అంతా అనుకున్న దానికి భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ కనిపించడంతో.. బీహార్ ప్రజలు ఇంత కమిటెడ్‌గా తీర్పు ఇవ్వడమేంటనే చర్చ మొదలైంది. ముఖ్యంగా అందరి ఫోకస్ ఇప్పుడు యువ నాయకుడు తేజస్వి యాదవ్ రాజకీయ భవిష్యత్ పైనే ఉంది. ఎన్నికల ప్రచారంలో  ఆయన చూపించిన దూకుడు, యువతను ఆకట్టుకోవడంలో సాధించిన సక్సెస్, ప్రతిపక్ష మహాఘట్‌బంధన్ కూటమిని ముందుకు నడిపించిన తీరు.. తలపండిన రాజకీయ నేతలను, పరిశీలకులను సైతం విస్మయపరిచింది. కచ్చితంగా.. తేజస్వి నాయకత్వంలో.. బీహార్‌లో మహాఘట్‌బంధన్ అంచనాలకు మించి పర్ఫామ్ చేస్తుందనుకున్నారంతా. కానీ, ఎగ్జిట్ పోల్స్ వచ్చాకే.. బీహార్‌లో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో అందరికీ అర్థమైంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ.. దాదాపుగా ఎన్డీయేకే మొగ్గు చూపడంతో.. అంతా అవాక్కయ్యారు. 

అయితే.. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో చాలావరకు ఎగ్జిట్ పోల్స్ తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ కూటమి గెలుస్తుందని అంచనా వేశాయి. కానీ, ఫలితాలు వచ్చినప్పుడు ఎన్డీయే స్వల్ప మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకుంది. ఆ ఎన్నికల్లో ఎన్డీయే 125 సీట్లు గెలుచుకోగా, మహాకూటమి 110 సీట్లకు పరిమితమైంది. ఆర్జేడీ  మాత్రం అత్యధికంగా 75 సీట్లు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు, వాస్తవ ఫలితాలకు.. పెద్ద తేడా వచ్చింది. ఈసారి కూడా ఎన్నికలు హోరాహోరీగా సాగడంతో, చివరి నిమిషంలో ఓటర్ల నిర్ణయం.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఉండొచ్చనే ఆశ  మహా‌ఘట్‌బంధన్ క్యాంప్‌లో ఇప్పటికీ ఉంది. ఏదేమైనా, ఈ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ ఓ రైజింగ్ స్టార్‌గా నిలిచారు. ఆయన జీవితంలో.. 2025 బీహార్ ఎన్నికలు.. ఓ కీలకమైన టర్నింగ్ పాయింట్‌గా నిలిచాయ్. బీహార్‌ పాలిటిక్స్‌లో.. నితీశ్ కుమార్ తర్వాత అంతటి బలమైన, ప్రజలను ఆకట్టుకోగల నేతగా తేజస్వి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ముఖ్యంగా.. యువతని ఆకట్టుకోవడంలో తేజస్వి సక్సెస్ అయ్యారు. ప్రధానంగా ఉద్యోగ, ఉపాధి కల్పన అస్త్రంతో జనంలోకి వెళ్లారు. బీహార్ యువత, ముఖ్యంగా నిరుద్యోగులు భారీ ఎత్తున.. తేజస్వి యాదవ్ ప్రచారానికి తరలివచ్చారు. తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామనే హామీ.. ఓ గేమ్ ఛేంజర్‌గా మారింది. 

తేజస్వి యాదవ్.. మహాఘట్‌బంధన్ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా  దాదాపు ఒంటరి పోరాటాన్ని నడిపించారు. నితీశ్ కుమార్, ప్రధాని మోడీ లాంటి అగ్ర నేతల ఉమ్మడి శక్తిని ఎదుర్కొని కూడా ప్రచారంలో బలంగా నిలబడ్డారు. చాలా చోట్ల గట్టి పోటీ ఇచ్చారు. ఆర్జేడీ అంటే కేవలం ముస్లిం-యాదవ్ ఓట్ బ్యాంక్ అన్న అపవాదును తొలగించడానికి తేజస్వి ప్రయత్నించారు. ఉద్యోగాలు, అభివృద్ధి అంశాలకు పెద్దపీట వేసి అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టేందుకు కృషి చేశారు. అయినప్పటికీ.. బీహార్ ప్రజలు ఎందుకు తేజస్వి యాదవ్‌కి మద్దతుగా నిలవలేకపోయారనే చర్చ మొదలైంది. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమై,  మహాఘట్‍‌బంధన్ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తే.. మరో ఐదేళ్లు తేజస్వి అపొజిషన్‌కే పరిమితం అవుతారు. అధికారంలోకి వస్తామనే ఆశల నుంచి, మరోసారి ప్రతిపక్షానికే పరిమితం అవడం అనేది.. తేజస్వి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇది ఆయన రాజకీయ భవిష్యత్‌పై ప్రతికూల ప్రభావం చూపే చాన్స్ కూడా ఉందంటున్నారు. అయితే.. ఆర్జేడీ మరోసారి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచే అవకాశం ఉన్నందున తేజస్వి యాదవ్ బలమైన ప్రతిపక్ష నాయకుడి పాత్రను పోషిస్తారా? అధికారం దక్కలేదని కుంగుబాటుకు గురవుతారా? అన్నదే ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారింది. తేజస్వి యాదవ్ వయసు 40 ఏళ్ల లోపే ఉంది. రాజకీయంగా ఇది చాలా చిన్న వయసు. మరో ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా పెద్దగా తేడా ఏమీ ఉండదంటున్నారు. నితీశ్ కుమార్ వయసు పెరుగుతోంది కాబట్టి.. రాబోయే రోజుల్లో తేజస్వికే ఎక్కువ అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu