మదనపల్లిలో కిడ్నీ రాకెట్‌ గుట్టురట్టు

 

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో  కిడ్నీ రాకెట్‌ గుట్టురట్టయ్యింది. పట్టణంలోని గ్లోబల్‌ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి రాకెట్‌ బయటకొచ్చింది. కిడ్నీ ఇచ్చిన మహిళ మృతిచెందడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 

వైజాగ్‌కు చెందిన పద్మ అనే మహిళ.. మరో ఇద్దరు మహిళలను మదనపల్లి గ్లోబల్ ఆసుపత్రికి తీసుకొచ్చింది. వారికి మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ చేసి కిడ్నీలు తొలగించారు. ఆపరేషన్ తర్వాత యమున అనే మహిళ మృతిచెందింది. 

అక్రమ కిడ్నీ మార్పిడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. యమున కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మదనపల్లె గ్లోబల్‌ ఆసుపత్రి వైద్యులను అరెస్ట్ చేశారు. కిడ్నీ రాకెట్‌లో కీలక నిందితుడు రాకేశ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

అన్నమయ్య జిల్లాకు చెందిన డీసీహెచ్‌ డాక్టర్‌ ఆంజనేయులు కోడలు డాక్టర్‌ శాశ్వతి గ్లోబల్‌ ఆసుపత్రిని నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కిడ్నీ రాకెట్ వెనుక మదనపల్లె డయాలసిస్‌ కేంద్రం మేనేజర్‌ బాలు, పుంగనూరు డయాలసిస్‌ మేనేజర్‌ వెంకటేశ్‌ నాయక్‌ ప్రమేయం ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది.

డాక్టర్‌ శాశ్వతి ఈ ముఠాతో కలిసి కిడ్నీ మార్పిడులకు ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. డయాలసిస్‌ సెంటర్‌కు వచ్చే ధనవంతులను టార్గెట్‌ చేసి, కిడ్నీ అవసరమైన పేషెంట్లకు కొత్త కిడ్నీలు దొరుకుతాయని నమ్మబలికే ఈ రాకెట్‌ నడిపారు.

ఈ క్రమంలో విశాఖపట్నానికి చెందిన సూరిబాబు భార్య యమునను కిడ్నీ బ్రోకర్లు పద్మ, సత్య, వెంకటేశ్‌ సంప్రదించారు. కిడ్నీ ఇస్తే రూ.8 లక్షలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. యమున కిడ్నీని మదనపల్లె గ్లోబల్‌ ఆసుపత్రిలో సేకరించి, గోవాలోని ఒక వ్యక్తికి పంపించేందుకు ఏర్పాట్లు చేశారు.

నవంబర్‌ 9న ఆపరేషన్‌ జరుగుతుండగా, యమున మూర్చపడి మృతిచెందింది. ఈ ఘటనను గ్లోబల్‌ ఆసుపత్రి నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా దాచిపెట్టడానికి ప్రయత్నించారు. మృతదేహాన్ని తిరుపతి మీదుగా వైజాగ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు.

అయితే యమున భర్త సూరిబాబుకు అనుమానం రావడంతో తిరుపతి నుంచి 112కి ఫిర్యాదు చేశారు. తిరుపతి పోలీసుల సమాచారంతో మదనపల్లె టూ టౌన్‌ పోలీసులు గ్లోబల్‌ ఆసుపత్రిపై దాడి చేశారు. అక్కడే ఉన్న మేనేజర్లు బాలు, వెంకటేశ్‌ నాయక్‌లను అదుపులోకి తీసుకున్నారు. అలాగే వైజాగ్‌కు చెందిన బ్రోకర్లు సత్య, పద్మ, వెంకటేశ్వర్లను కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu