కాంగ్రెస్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్.. బీఆర్ఎస్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం క‌విత‌క్క‌?

కల్వకుంట్ల క‌విత వ‌ల్ల ఇప్పుడు బీఆర్ఎస్ కి ఎంత చేటు వ‌చ్చిందంటే.. ఆమె ఎక్క‌డ పర్యటిస్తే.. అక్కడి కారు పార్టీ లీడ‌ర్ల‌కు గుండె దడ పెరిగిపోతోంది. మొన్న వ‌న‌ప‌ర్తికి వెళ్లిన కవిత అక్కడ,  నిరంజ‌న్ రెడ్డిని ఉతికి ఆరేశారు. వీరిద్ద‌రి మ‌ధ్యకు వ‌న‌ప‌ర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి ఎంట్రీ ఇచ్చారు. ద‌మ్ముంటే కేటీఆర్, నిరంజ‌న్ రెడ్డి.. క‌విత ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని నిల‌దీశారు.

అన‌వ‌స‌రంగా లేని పోని గొడ‌వ‌ల‌కు క‌విత తావిస్తున్నారంటూ..  ఏం చేయాలో పాలు పోక త‌ల ప‌ట్టుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు. క‌విత తాను చేసిన యాత్ర‌ల‌కు సంబంధించిన  ఏర్పాట్లు చేసుకోవాల్సింది  పోయి.. ఇర‌వై నాలుగ్గంట‌లూ బీఆర్ఎస్  లీడ‌ర్ల‌ను ఆడిపోసుకోవ‌డం, వారి అవినీతి బాగోతాలు బ‌య‌ట  పెడ‌తాన‌ని హెచ్చరించడమేంటి?   కాంగ్రెస్, బీజేపీల‌క‌న్నా కూడా ఈ క‌విత‌తోనే ఎక్కువ ఇబ్బంది కలుగుతోంది. పరువుపోతోందన్న మాట బీఆర్ఎస్ నేతల నుంచి వినిపిస్తోంది.  

క‌విత ప్ర‌ధాన‌మైన ల‌క్ష్యం   బీఆర్ఎస్ లో అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటోన్న వారి బారి నుంచి తన తండ్రి కేసీఆర్ ని ఎలాగైనా  త‌ప్పించాల‌న్నది కవిత లక్ష్యంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ లో అవినీతిపరులకు హ‌రీష్ రావు అండ‌దండ‌లున్నాయ‌ని ఎస్టాబ్లిష్ చేస్తూ, త‌న తండ్రి కేసీఆర్ కి ఇందులో ఎంత మాత్రం సంబంధం లేద‌ని నిరూపించాల‌ని కవిత లక్ష్యంగా కనిపిస్తోంది.

అయితే ఇక్క‌డే ప్ర‌కాశ్ వంటి మాజీ నేత‌లు.. క‌విత చేస్తోన్న ఈ వింత ప్ర‌యోగం బెడిసికొడుతోంద‌ని అంటున్నారు. ఎందుకంటే హ‌రీష్, కేసీఆర్ ఇద్దరూ వేరు వేరు కాదు. పైపెచ్చు పార్టీలో కృష్ణార్జ‌నులుగా గుర్తింపు పొందారు. ఇద్ద‌రూ ఒక్క తాను ముక్క‌లే. హ‌రీష్ చేసే ప‌ని ఏదైనా స‌రే కేసీఆర్ కి తెలిసే జ‌రుగుతుంది. ఒక వేళ హ‌రీష్‌ ఏదైనా తెలియ‌క చేసినా కూడా అదంతా కూడా కేసీఆర్ కే త‌గిలి తీరుతుంది. ఈ విష‌యం కవితకు  తెలియంది కాదంటారు వీరు. 

కాళేశ్వ‌రం విష‌యంలో క‌విత చేసిన ప్ర‌ధాన ఆరోప‌ణ హ‌రీష్ రావు మీద‌. ఈ ప్రాజెక్టు విష‌యంలో జ‌రిగిన అవినీతి మొత్తం హ‌రీష్ రావు ప‌నేనంటారామె. అయితే కేసీఆర్ కి తెలీకుండా ఇదంతా జ‌రుగుతుందా? అన్న ప్ర‌శ్న‌కు ఆస్కార‌మేర్ప‌డుతోంది. ఇది స్థానికంగానే కాదు, జాతీయ స్థాయిలోనూ చ‌ర్చ‌కు దారి తీస్తోంది. కేసీఆర్ కి తెలీకుండా హ‌రీష్ అలాంటి ప‌నులు చేయ‌గ‌ల‌రా? అంటూ నేష‌న‌ల్ మీడియా సైతం ప్ర‌శ్నిస్తోంది.

ఇప్పుడీ విష‌యంలో క‌విత‌కు కూడా కౌంట‌ర్లు భారీగానే ప‌డుతున్నాయ్. ఆయా ప్రాంతాల‌కు క‌విత వ‌చ్చి నిరంజ‌న్ రెడ్డి వంటి వారి అవినీతిని  బ‌ట్ట‌బ‌య‌లు చేస్తుంటే.. వారు కూడా   రివ‌ర్స్ లో ఆమెకు కౌంట‌ర్లు వేస్తున్నారు. ఆమె ఇర‌వై ల‌క్ష‌ల వాచీ, ఆపై బంజారాహిల్స్ లో విలాస‌వంత‌మైన బంగ‌ళాల గురించి లేవనెత్తుతున్నారు.   ఇక ఢిల్లీ లిక్క‌ర్ క్వీన్ గా క‌విత తెచ్చిన చెడ్డ పేరే పార్టీని నిలువునా ముంచింద‌నీ తీవ్ర స్థాయిలో  విరుచుకుప‌డుతున్నారు.

బీఆర్ఎస్ అసెంబ్లీలో ప్ర‌ధాన  ప్ర‌తిప‌క్ష‌మో కాదో అటుంచితే, బీఆర్ఎస్ కి మాత్రం క‌విత రూపంలో అతి పెద్ద ప్ర‌తిప‌క్షం త‌యారైందనడంలో సందేహం లేదు. దీంతో  ఇప్పుడు కారు పార్టీ లీడ‌ర్ల చూపు క‌విత‌పైకి మ‌ళ్లింది. వీళ్లూ వీళ్లూ కొట్టాడుకుంటుంటే కాంగ్రెస్ చేష్ట‌లుడిగి  చోద్యం చూస్తోంది. ఇది టాపిక్ డైవ‌ర్ష‌నా? లేక క‌విత మార్క్ పాలిటిక్సా,   లేదంటే..  కేసీఆర్ ఆడిస్తోన్న వింత  నాట‌కమా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu