క‌విత అస‌లు వ్యూహం అదేనా?

ఇంటిగుట్టు వ్యాధి ర‌ట్టు అంటారు.  తెలంగాణ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత  బీఆర్ఎస్ ఇంటి  పార్టీ  గుట్టు మొత్తం బ‌య‌ట  పెట్టేస్తూ.. ఆ పార్టీ ప్ర‌త్య‌ర్ధుల‌కు పెద్ద‌గా ప‌ని లేకుండా  చేస్తున్నారు. మొన్న‌టి వ‌ర‌కూ జ‌గ‌దీశ్ రెడ్డితో క‌య్యానికి కాలుదువ్విన క‌విత తాజాగా నిరంజ‌న్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.  

అయితే ఆమె ఎందుకు ఇదంతా చేస్తున్నారు? కారణాలేంటి? వ్యూహంమేంటి? అన్న చర్చ తెలంగాణ రాజకీయాలలో జోరుగా సాగుతోంది. క మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు టార్గెట్ గా చేస్తున్న కల్వకుంట్ల కవిత చేస్తున్న విమర్శలపై హరీష్ రావు పెద్దగా స్పందించకున్నా.. కవిత విమర్శలకు కౌంటర్ ఇస్తున్న  జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి వంటి రెండవ శ్రేణి నాయకులపై కూడా ఆమె  విరుచుకుపడుతున్నారు. దీనిని బట్టి చూస్తుంటే.. హరీష్ రావుపై తాన చేసిన కామెంట్లకు కౌంటర్లిచ్చే నాయకులను కవిత టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. హరీష్ కు మద్దతుగా నోరెత్తిన నేతలపై కవిత విమర్శలతో విరుచుకుపడటమే కాకుండా, వారి అవినీతి బాగోతాలు కూడా బయటపెడుతూ వారి నోళ్లు మూయించాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.  

ఇంత‌కీ మాజీ మంత్రి  నిరంజ‌న్ రెడ్డి ఏమ‌న్నారో చూస్తే.. కవితకు స‌భ్య‌త సంస్కారాలు లేవ‌ని కామెంట్ చేశారాయ‌న‌. ఎవ‌రి మెప్పు కోసం ఇదంతా చేస్తున్నారంటూ ప్రశ్నించిన నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావుపై కవిత చేసిన ఆరోపణలు వాస్తవమైతే వాటిని నిరూపించాలని డిమాండ్ చేశారు.  నిరంజన్ రెడ్డిపై కవిత ఓ రేంజ్ లో ఫైర్ అవుతూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడానికి ఇదీ కారణమంటున్నారు పరిశీలకులు.  

అంగ‌డి స్థ‌లాల‌ను క‌బ్జా చేసిన  నిరంజ‌న్ మూడు ఫామ్ హౌస్ ల‌ను క‌ట్టుకున్నారనీ,  ఆయ‌న అవినీతిని హ‌రీష్ ఎప్ప‌టిక‌ప్పుడు క‌వ‌ర్ చేస్తూ వ‌చ్చారనీ, ఈ వ్యవహారాన్నంతా మీడియా ద్వారా పెద్ద సార్ దృష్టికి తీసుకెడతానని హెచ్చరించారు కవిత. ఇదంతా చూస్తుంటే.. కవిత వ్యూహాత్మకంగానే నిరంజన్ రెడ్డిపై విమర్శల దాడికి దిగినట్లుగా కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు.  ఇప్ప‌టి వ‌ర‌కూ  వీరంద‌రూ అవినీతి చేస్తున్నా.. పెద్ద సారు కేసీఆర్ కి తెలీకుండా హరీష్  అడ్డుగోడ‌లా నిలిచాడ‌నీ.. వీరి మ‌ధ్య ఉన్న అవినీతి ఐక్యతా రాగం హ‌రీష్ కి త‌ప్ప  కేసీఆర్ కి తెలీద‌న్న‌ట్టుగా  మాట్లాడుతున్నారు. దీని ద్వారా తెలుస్తున్న దేంటంటే కేసీఆర్ కి తెలీకుండా వీరంతా అవినీతి చేశారు కాబ‌ట్టి  ఒక దెబ్బతో హరీష్ ను పార్టీకి దూరం చేయడం, కేసీఆర్ ను  పులుక‌డిగిన ముత్యంగా ఎస్టాబ్లిష్ చేయ‌డం కవిత వ్యూహం అంటున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu