ఈ ఏడు చిట్కాలు పాటిస్తే... నూరేళ్లు బతికేయచ్చు!

 

నిండు నూరేళ్లు బతకాలని ఎవరికి మాత్రం ఉండదు. కానీ అలా బతికితే సరిపోదు! వృద్ధాప్యంలో కూడా మెదడు చక్కగా పనిచేయాలి. ఎంతటి కష్టాన్నయినా తట్టుకునేంత గుండెబలం ఉండాలి. చాలామందికి వయసు గడిచేకొద్దీ ఈ రెండు అవయవాలే బలహీనపడిపోతుంటాయి. ఎన్నాళ్లు బతికి ఏం లాభం అన్నట్లుగా కాలాన్ని నెట్టుకొస్తూ ఉంటారు. మరి ఇందుకు ఉపాయం లేదా అంటే లేకేం!

 

అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌కు చెందిన పరిశోధకులు బలమైన గుండె, మెదడు ఉండటానికి ఎలాంటి జీవనశైలి ఉండాలో తెలుసుకోవాలనుకున్నారు. ఇందుకోసం ఇప్పటివరకూ ఈ దిశగా వచ్చిన 182 పరిశోధనల ఫలితాలను క్రోడీకరించి చూశారు. వాటిని గమనించిన తర్వాత అసలు గుండె, మెదడు ఎందుకు దెబ్బతింటాయో ఒక అవగాహన ఏర్పడింది. దాన్ని అధిగమించే చిట్కాలూ కనిపించాయి.

 

మన రక్తనాళాలు నిదానంగా కుంచించుకుపోవడమే గుండె, మదడులు దెబ్బతినేందుకు ప్రధాన కారణం అని తేలింది. ఇలా రక్తనాళాలు కుదించుకుపోవడం వల్ల రక్తసరఫరా తగ్గిపోవడమే కాకుండా, కొవ్వులాంటి పదార్థాలు కూడా అక్కడ పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇది క్రమేపీ పక్షవాతం, గుండెపోటు వంటి సమస్యలకి దారితీస్తూ ఉంటుంది. వైద్యపరిభాషలో ఈ పరిస్థితిని atherosclerosis అంటారు.

 

Atherosclerosis ఒక వ్యాధి కావచ్చు. కానీ చాలా సందర్భాలలో మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కూడా ఈ పరిస్థితికి కారణం అవుతాయి. సరైన శారీరిక వ్యాయామం లేకపోవడం, మంచి ఆహారాన్ని తీసుకోకపోవడం, పొగాకు వంటి వ్యసనాలు... అన్నీ కూడా రక్తనాళాలలు కుదించుకుపోయేలా చేస్తాయి. అల్జీమర్స్, డిమెన్షియా వంటి రోగాలకు కూడా కారణం అవుతాయి.

 

ఇంతకీ ఈ పరిస్థితిని దాటేందుకు పరిశోధకులు చెబుతున్న ఏడు చిట్కాలు ఇవే.......

- రక్తపోటుని అదుపులో ఉంచుకోవడం.

- ఒంట్లో కొలెస్ట్రాల్ మోతాదు మించకుండా చూసుకోవడం.

- షుగర్‌ని నియంత్రించుకోవడం.

- శారీరక శ్రమ చేయడం.

- పౌష్టికాహారాన్ని తీసుకోవడం.

- బరువుని ఎప్పటికప్పుడు సరిచూసుకోవడం.

- పొగాకు జోలికి పోకుండా ఉండటం.

వినేందుకు ఈ పద్ధతులన్నీ కాస్త కఠినంగానే ఉండవచ్చు. కానీ అనారోగ్యంతో ఇల్లూ, ఒళ్లూ గుల్ల చేసుకునేకంటే ఇది చాలా సులభం అంటున్నారు. లేకపోతే మున్ముందు కోట్లమంది డిమెన్షియాలాంటి సమస్యలని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

- నిర్జర.