లిక్కర్ స్కాం.. విజయసాయి బాటలో మాజీ మంత్రి నారాయణస్వామి?

జగన్ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం విషయంలో అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అప్రూవర్ గా మారనున్నారా?  అంటే ఆయన మాటలను బట్టి ఔననే అనుకోవలసి వస్తున్నది. జగన్ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పని చేసిన నారాయణ స్వామి.. తాజాగా సిట్ విచారణను ఎదుర్కొన్నారు. సిట్ నోటీసుల మేరకు విచారణకు హాజరు కావడానికి ఆరోగ్యం బాలేదని చెప్పినప్పటికీ.. సిట్ ఆయన నివాసానికే వెళ్లి విచారించింది. సిట్ విచారణ అనంతరం ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు.

మద్యం కుంభకోణంతో తనకు ఎటువంటి సంబంధం లేదనీ, ఈ విషయంలో తనను ఇరికించడానికి ఇద్దరు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారనీ ఆరోపించారు. అంతే కాదు.. మద్యం విధాన రూపకల్పలోనూ, అమలు విషయంలోనూ తానకు ఇసుమంతైనా ప్రమేయం లేదని చెప్పేశారు. అక్కడితో ఆగకుండా.. మద్యం విక్రయాలలో ఆన్ లైన్ పేమెంట్ కు అవకాశం లేకుండా చేసిన సంగతి వాస్తవమేనన్నారు. ఈ మాటలన్నీ మద్యం కుంభకోణం కేసులో తొలి చార్జిషీట్ దాఖలై అందులో పలుమార్లు మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరును ప్రస్తావించిన తరువాత అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి నోరు విప్పారు. మద్యం కుంభకోణం జరిగిం దనీ, అందులో పలువురు సొమ్ములు ఆర్జించారన్న మాట నిజమేనంటూనే.. తనకు మాత్రం ఇసుమంతైనా సంబంధం లేదన్నారు. అలాగే ఆన్ లైన్ పేమెంట్లకు నో అన్న విషయం కూడా వాస్తవమేనన్నారు.

సిట్ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తాననీ, తనకు తెలిసిన సమాచారం మొత్తం చెబుతాననీ పేర్కొన్నారు. నారాయణ స్వామి మాటలను బట్టి ఆయన అప్రూవర్ గా మారేందుకు సిద్ధ పడ్డారని అవగతమౌతోంది. ఈ కేసులో ఇప్పటికే విజయసాయి రెడ్డి అప్రూవర్ గా మారేందుకు సిద్ధమయ్యారు. ఆయన వైసీపీకి రాజీనామా చేసేశారు. అవసరమైతే అన్నివిషయాలూ సిట్ కు వెల్లడి స్తానని కూడా ప్రకటించారు. మద్యం కుంభకోణంలో రాజ్ కేసిరెడ్డి కర్త, కర్మ, క్రియ అంటూ చెప్పినది కూడా విజయసాయే అన్న విషయం తెలిసిందే. విజయసాయి రెడ్డి రాజ్ కేసిరెడ్డి పేరు చెప్పిన తరువాతనే మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు జోరందుకుంది. రాజ్ కేసిరెడ్డి సహా పలువురిని సిట్ అరెస్టు చేసింది. ఇక ఇప్పుడు నారాయణ స్వామి కూడా విజయసాయి రెడ్డి బాటలోనే పయనిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతానికి పేర్లు ప్రస్తావించకుండా ఇద్దరు వైసీపీ నేతలు అన్న నారాయణ స్వామి సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తాననడం ద్వారా అప్రూవర్ గా మారేందుకు సిద్ధంగా ఉన్నానన్న సంకేతాలు ఇచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu