ఐటీ ఉద్యోగులూ వర్క్ ఫ్రం హోం చేయండి... సైబరాబాద్ పొలీసుల సూచన

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఈ రోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా సైబరాబాద్ ప్రాంతంలో అతి భారి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్న హైదరాబాద్ వాతావరణ శాఖ.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించింది. కాగా వాతావరణ శాఖ హెచ్చరికతో అప్రమత్తమైన సైబరాబాద్ పోలీసులు.. ఐటీ కంపెనీలు బుధవారం (జులై 23) వర్క్ ఫ్రం హోం విధానాన్ని పాటించాలని పేర్కొన్నారు.  భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తకుండా ఉద్యోగులకు ఇంటి వద్దనే పని చేసే వీలు కల్పించాలని, ఈ విషయంలో ఐటీ కంపెనీలు సహకారం అందించాలని సైబరాబాద్ పోలీసు శాఖ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పేర్కొంది.  

ఇక పోతే అటు ఆంధ్రప్రదేశ్ లోనూ జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం (జులై 22) కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తా, తమిళనాడు ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో బుధవారం  (జులై 23) కూడా ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది.  

దీనికి తోడు ఉత్తర బంగాళాఖాతంలో  బుధవారం  (జులై 23) ఏర్పడినఉపరితల ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయనీ, అలాగే బంగాళాఖాతంలో వచ్చే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందనీ వాతావరణ శాఖ పేర్కొంది.  దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమలలో  పిడుగులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయనీ,  తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu