నేటికాలం అమ్మాయిలు వివాహానికి దూరంగా ఉండాలని అనుకుంటున్నారు ఎందుకంటే..!

ఒకప్పటి కాలంలో పెళ్లి అనేది అమ్మాయిల కల. పెళ్లి జరగడం కోసం ఎంతో ఆశగా ఎదురుచూసేవారు.  కానీ నేటికాలంలో అమ్మాయిలు పెళ్లి అంటే విముఖత చూపిస్తున్నారు. ఒకప్పుడు అబ్బాయిలను పెళ్లి చేసుకోరా.. అని కుటుంబ సభ్యులు చాలా బతిమాలేవారు.. ఇప్పుడు అమ్మాయిల విషయంలో అలాంటి పరిస్థితి ఏర్పడింది. చాలామంది అమ్మాయిలు పెళ్లి  చేసుకోవడానికి   వెనుకాడుతున్నారు. కుటుంబ సభ్యులు ఎంత ఒత్తిడి చేసినా సరే.. పెళ్లి అంటే ఆమడ దూరం పారిపోయే అమ్మాయిలు కోకొల్లలు ఉన్నారు నేటికాలంలో..  

వివాహం గురించి మహిళల అభిప్రాయాలు మారడానికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా మంది అమ్మాయిలు  వివాహం అంటే సందేహం, భయం,  అసౌకర్యం వంటి భావనలకు లోనవుతుంటారు. దీని వెనుక ఒకటి కాదు, అనేక లోతైన సామాజిక,  మానసిక కారణాలు ఉన్నాయి. నేటి అమ్మాయిలు పెళ్లికి ఎందుకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారో తెలుసుకుంటే..

స్వాతంత్ర్యం, స్వావలంబన..

కొన్నేళ్ళ కిందటి వరకు ఆడపిల్లలు ఆర్థికంగా తండ్రిపై ఆధారపడి, వివాహం తర్వాత భర్తపై ఆధారపడేవారు. ఆధునిక యుగంలోని అమ్మాయిలు ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నారు.  మంచి కంపెనీలలో పనిచేస్తారు లేదా వ్యాపార మహిళలుగా రాణిస్తుంటారు. ఆదాయం పరంగా కూడా  ఎవరికీ తక్కువ కాదు. అలాంటి  పరిస్థితిలో వారు ఇతరులపై ఆధారపడవలసిన అవసరం లేదు. దీనితో పాటు, మహిళల్లో స్వాతంత్ర్యంగా ఉండాలనే కోరిక కూడా పెరుగుతోంది.  స్వావలంబన ఉన్న మహిళలు వివాహం తర్వాత తమ స్వేచ్ఛకు భంగం కలుగుతుందని భావిస్తారు. ఈ కారణంగా  వివాహం చేసుకోవడానికి వెనుకాడతారు.

కెరీర్..

మహిళలు గతంలో కంటే  అక్షరాస్యత పరంగా చాలా మెరుగ్గా ఉన్నారు. అబ్బాయిలతో సమానంగా చదువుకుంటున్నారు.  వారి కంటే మెరుగ్గా సంపాదిస్తున్నారు కూడా.  వారు తమ కెరీర్ లో కూడా విజయం సాధించాలని కోరుకుంటారు. చాలా మంది అమ్మాయిలు ముందుగా తమ కెరీర్ ను నిర్మించుకోవాలని కోరుకుంటారు. వారు వివాహాన్ని ఒక విరామం లేదా బాధ్యతగా చూస్తారు. కానీ కొంతమంది వివాహం కారణంగా తమ కెరీర్ ను వదిలేసే సందర్భాలు, సంఘటనలు ఉన్నాయి. ఈ కారణంగా  వారు వివాహాన్ని కెరీర్ విజయానికి అడ్డంకిగా కూడా భావిస్తారు. దీని కారణంగా  కెరీర్ లో విజయం సాధించే వరకు వివాహం చేసుకోవాలని అనుకోరు. అమ్మాయిల మొదటి ప్రాధాన్యత కెరీర్ గా ఉండటం దీనికి కారణం.

బంధాలు తెగిపోవడం, విడాకులు..

నేటికాలంలో ఎంత గొప్పగా వివాహాలు జరుగుతున్నాయో..  అంత తొందరగా గొడవలు, విడాకులు జరుగుతున్నాయి.  తమ చుట్టూ చాలామంది వివాహ బంధంలో వైఫల్యం అవ్వడం, అమ్మాయిలు ఆర్థికంగా పీడింపబడటం,  వివాహం తర్వాత గౌరవం,  ప్రాధాన్యత లభించకపోవడం వంటివి  దగ్గరగా చూసిన అమ్మాయిలు  వివాహం గురించి,  విష సంబంధాల గురించి భయపడతారు. వివాహం తర్వాత అమ్మాయిల పరిస్థితి, భర్తతో గృహ సమస్యలు మొదలైనవి వివాహం తర్వాత వారి సంబంధం కూడా భారంగా మారవచ్చని భావించేలా చేస్తాయి. అటువంటి పరిస్థితిలో వివాహం చేసుకోకపోవడమే మంచిదని వారు భావిస్తారు.

బాధ్యతలు..

వివాహం తర్వాత మహిళల బాధ్యతలు పెరుగుతాయి. ఆమె ఉద్యోగి అయినా లేదా గృహిణి అయినా ఇంటి పనులన్నింటినీ,  కుటుంబ సభ్యులందరి ఇష్టాయిష్టాలను చూసుకోవడం కోడలి విధిగా పరిగణించబడుతుంది. అమ్మాయిలు ఈ సంప్రదాయాన్ని బహిరంగంగా ప్రశ్నిస్తారు. ఇంటి బాధ్యతలన్నీ ఏకపక్షంగా వారి మీద నెట్టడం అమ్మాయిలలో విముఖత కు దారి తీస్తుంది.  వివాహం తర్వాత ఇంటి బాధ్యతలన్నీ కోడలిపైనే ఎందుకు ఉంటాయి అనేది వారి ప్రశ్న? ఈ ఆలోచనకు సరైన సమాధానం లభించనప్పుడు వివాహానికి దూరంగా ఉండటం మంచిదని వారు భావిస్తారు.

సామాజిక జోక్యం..

వివాహం తర్వాత అమ్మాయిలు ధరించే దుస్తుల దగ్గర నుండి, వారికి  పిల్లలు ఎప్పుడు పుడతారు అనే విషయం వరకు చాలా విషయాలు అమ్మాయిల స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తాయి. వివాహం తర్వాత ఒక అమ్మాయి జీవితంలో సామాజిక జోక్యం పెరుగుతుంది. వివాహం చేసుకోవడం వల్ల వారి వ్యక్తిగత స్థలం తగ్గుతుందని అమ్మాయిలు భావిస్తారు. అటువంటి పరిస్థితిలో వారు వివాహానికి దూరంగా ఉండటం ప్రారంభిస్తారు.  అలాంటి జోక్యాన్ని నివారించాలని కోరుకుంటారు.


                                   *రూపశ్రీ.