యువతని వెర్రెత్తిస్తున్న ‘జిమిక్కి కమ్మల్‌’ పాట!

 

ఓ ఐదేళ్ల క్రితం వచ్చిన ‘వై దిస్‌ కొలవరి డీ’ పాటను ఎవరు మర్చిపోగలరు. అప్పట్లో ఏ సందులో చూసినా ఈ పాటే వినిపించేది. ప్రతి వేదిక మీదా ఈ పాటకి అడుగులు వేసేవారు. అలా ఓ ఏడాదిపాటు ఈ పాటని పీల్చి పిప్పి చేసి వదిలిపెట్టాం. దేశాన్ని అంతగా వెర్రెత్తించిన పాట మళ్లీ రావడం అసాధ్యం అనుకున్నారంతా. కానీ వచ్చేసింది. అదే జిమిక్కి కమ్మల్‌!

 

ఆగస్టు నెలాఖరున మలయాళంలో ‘వెలిపండితె పుస్తకం’ అనే సినిమా వచ్చింది. ఇందులో మోహన్‌లాల్ హీరో! ఆయనది కాలేజి కుర్రకారుని అదుపు చేసే లెక్చరర్‌ పాత్ర. నిజానికి ఈ సినిమా ఏమంత గొప్పగా లేదంటూ విమర్శకులు పెదవి విరిచారు. మోహన్‌లాల్‌లోని నటుడిని ఇందులో ఉపయోగించుకోలేకపోయారంటూ దెప్పిపొడిచారు.

 

 

మొత్తానికి వెలిపండితె పుస్తకం ఓ మాదిరి విజయాన్ని మాత్రమే సాధిస్తుందనుకున్నారంతా! కానీ అందులోని ఓ పాట కారణంగా ఇప్పుడు సినిమా తెగ వసూళ్లు సాధిస్తోంది. సినిమాలోని ఓ సందర్భంలో కుర్రకారు ‘జిమిక్కి కమ్మల్‌’ అనే సరదా పాటని పాడుకుంటారు. ‘మా అమ్మ కమ్మలు’ అని ఈ పాట అర్థం. పాటలో పెద్దగా సరుకు లేదు. కానీ పాట వెనుక వినిపించే బీట్‌కు చిత్రమైన ఆకర్షణ ఉందని తోచింది నిర్మాతలకు. అంతే! ‘జిమిక్కి కమ్మల్‌ ఛాలెంజ్’ పేరుతో ఒక పోటీని మొదలుపెట్టారు. ఆ పాట బీట్‌కు అనుగుణంగా ఎవరైనా నాట్యం చేయవచ్చంటూ ప్రచారం మొదలుపెట్టారు.

 

‘జిమిక్కి కమ్మల్‌ ఛాలెంజ్’ నిజంగానే ఓ ట్రెండ్‌గా మారింది. అదే సమయంలో ఓనమ్‌ పండుగ కూడా రావడంతో కేరళలో జరిగే ప్రతి వేడుకలోనూ జిమిక్కి కమ్మల్‌కు నాట్యం చేయడం మొదలుపెట్టారు. అలా కొచ్చిలోని Indian School of Commerceలో జరిగిన ఓనం కార్యక్రమంలో కూడా ఈ పాటకి డాన్స్ చేశారు. ఇహ అక్కడి నుంచి ఈ కథ మరో మలుపు తీసుకుంది.

 

Indian School of Commerceలో జరిగిన డాన్స్‌ని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయగానే ఒక్కసారిగా వైరల్‌గా మారిపోయింది. పట్టుమని పది రోజులైనా గడవకముందే ఈ వీడియోని 90 లక్షల మంది చూశారు. ఆ వీడియోలో అందరికన్న హుషారుగా డాన్స్ చేస్తున్న ‘షెరిల్‌ కాదవన్’ అనే టీచరుకి ఫిదా అయిపోయారు. రాత్రికి రాత్రే షెరిల్‌కి లక్షలాది మంది ఫ్యాన్స్ ఏర్పడిపోయారు. ఆమె పేరుతో వందలాది సోషల్‌ మీడియా అకౌంట్లు పుట్టుకు వచ్చాయి. సినిమాల్లో ఆఫర్లూ మొదలైపోయాయి. ఈ పాటతో తన జీవితమే మారిపోయిందనీ, తనకి భయం కలిగేంత పాపులారిటీ వచ్చేసిందని షెరిల్‌ వాపోతున్నారు.

 

మొత్తానికి జిమిక్కి కమ్మల్‌ పుణ్యమా అని మలయాళ చిత్ర పరిశ్రమ మరోసారి వార్తల్లో నిలిచింది. 2015లో  వచ్చిన ప్రేమమ్, గత ఏడాది వచ్చిన పులిమురుగన్‌ (మన్యం పులి) సినిమాల విజయంతో ఊపు మీదున్న మలయాళ పరిశ్రమకి మరో గౌరవం దక్కింది. ఒకవైపు ఈ పాటకు యువత నాట్యం చేస్తుంటే, మరోవైపు తమ అభిమాన నటులు ఈ పాటకి డాన్స్ చేస్తున్నట్లుగా వీడియోలు వెలువడుతున్నాయి.

 

కొసమెరుపు: అమెరికాలో Jimmy Kimmel అనే టీవీ వ్యాఖ్యాత ఉన్నాడు. ఈ పాట చరణాలు ఆయన పేరుకి దగ్గరగా ఉండటంతో ఆయన ట్విట్టర్ పేజి కూడా సందడిగా మారిపోయిందట. విషయం తెలుసుకున్న Jimmy Kimmel తాను కూడా ఆ పాటని చూసి షెరిల్‌ అభినయానికి అభిమానిగా మారిపోయాడు. 

- నిర్జర.