ఆ క్షణం... అడుగు ముందుకి వేస్తే

హరిత, నమిత ఇద్దరూ కవలపిల్లలు. ఇద్దరికీ సంగీతం అంటే ప్రాణం. ఏళ్ల తరబడి ఎంతో కష్టపడి సంగీతాన్ని నేర్చుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ఈ ప్రపంచానికి తమ ప్రతిభని చూపించాలా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. ఊళ్లో జరిగే త్యాగరాయ ఉత్సవాలలో వాళ్లకి కూడా పాడే అవకాశం దక్కింది. అది వాళ్ల మొట్టమొదటి ప్రదర్శన కాబోతోంది.


కార్యక్రమం ఇంకో నెల రోజులు ఉందనగా ఇద్దరూ విరగబడి అభ్యాసం చేశారు. ఒకరిని మించి ఒకరు రాగం తీశారు. ఇక వేదిక ఎక్కడమే తరువాయి అన్నట్లుగా ప్రదర్శని సిద్ధపడిపోయారు. కార్యక్రమం రోజున తమ కుటుంబంతోనూ, గురువుగారితోనూ కలిసి ఆడిటోరియంకు చేరుకున్నారు. కానీ లోపలకి వెళ్లగానే వాళ్లిద్దరి కాళ్లూచేతులూ వణకడం మొదలుపెట్టాయి.


కార్యక్రమంలో భాగంగా ఒకొక్కరే వేదిక మీదకు వచ్చి తమ సంగీతాన్ని వినిపించసాగారు. ఇంతలో హరిత వంతు కూడా వచ్చేసింది. కానీ హరిత కాళ్లూ చేతులూ వణుకుతున్నాయి. భయంతో ఆమె కళ్లు తిరుగుతున్నాయి. అడుగు ముందుకు వేయడం కంటే వెనక్కి తిరిగి పారిపోవడం తేలిక అనిపిస్తోంది. కళ్ల ఎదురుగుండా ఎత్తయిన వేదిక, ఆ వేదికని ఎక్కాక వందల మంది ముందు పాడాలి, ఆ పాటలో తడబడితే నవ్వులపాలు కావాలి.... లాంటి ఆలోచనలన్నీ ఆమె మనసులోని దూసుకువస్తున్నాయి. కాసేపటికి ఏ ఆలోచనా లేకుండా కేవలం భయం మాత్రమే ఆమె మెదడంతా నిండిపోయింది. అంతే! తను ఉన్న కుర్చీలో మరింత వెనక్కి, మరింత లోతుకి దిగబడిపోయింది.


హరిత పరిస్థితి చూసిన వాళ్ల గురువుగారు ఆమెని బలవంతం చేయలేదు. తర్వాత నమిత వంతు వచ్చింది. నమిత కూడా హరితలాగానే భయపడిపోయింది. ఆమె ఒళ్లంతా చల్లబడిపోయింది. కానీ తడబడే అడుగులు వేస్తూ వేదిక దిశగా బయల్దేరింది. తాను ఎక్కడ తూలిపోతుందో అన్నంత నిస్తేజం నమితను ఆవహించింది. కానీ ఎలాగొలా వేదికను ఎక్కేసింది. అక్కడ మైకుని చూడగానే ఆమె చేతులు వణికాయి. ముందున్న జనాన్ని చూడగానే ఇక తను పాడలేననుకుంది. అంత భయంలో పాడటంకంటే చచ్చిపోవడం తేలికనిపించింది. అయినా బలవంతంగా పాటని మొదలుపెట్టింది.


నమిత ప్రదర్శన ఒక మాదిరిగా సాగింది. మధ్యమధ్యలో కొన్ని అపశృతుల దొర్లాయి. కొన్ని గతులు తప్పాయి, కొన్ని చోట్ల స్వరం పలకలేదు. తన ప్రదర్శన తనకే పేలవంగా తోచింది నమితకి. కానీ ప్రేక్షకులేమీ పగలబడి నవ్వలేదు. బ్రహ్మాండం ఏమీ బద్దలవలేదు. ‘ఈసారి మరికాస్త బాగాపాడు’ అంటూ గురువుగారు ప్రోత్సహించారు. ‘మొదటిసారైనా బాగా పాడావు’ అంటూ తల్లిదండ్రులు మురిసిపోయారు. అన్నింటికీ మించి తాను మరోసారి వేదికని ఎక్కి పాడగలను అన్న నమ్మకం కలిగింది నమితకి. మరోసారి ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో అన్న ఆశ మొదలైంది.


హరిత, నమిత ఇద్దరూ కవల పిల్లలు. ఇద్దరిదీ ఒకటే మనస్తత్వం. ఇద్దరిదీ ఒకటే ప్రతిభ. ఇద్దరూ ప్రదర్శన కోసం తగినంత కృషి చేశారు. వేదిక దగ్గరకు చేరుకోగానే ఇద్దరూ విపరీతంగా భయపడిపోయారు. జీవితాన్ని మలుపు తిప్పే సమయంలో హరిత తన భయానికి లోబడిపోయింది. నమిత బలవంతంగా దాని అవతలి ఒడ్డుకి చేరకుని... అంతగా భయపడాల్సినంత ఖర్మ లేదని తెలుసుకుంది. ఆ అవగాహన ఆమెలో ఓ స్థైర్యాన్ని నింపింది. వందలాది ప్రదర్శనలు ఇచ్చే జీవితానికి బాట వేసుకుంది. హరిత కూడా ఆ ఒక్క క్షణం తన భయాన్ని ఓర్చుకోగలిగితే ఎంత బాగుండేది!

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)


- నిర్జర.