పవన్‌ తిరుపతి పర్యటనపై విమర్శలు... ఎమ్మెల్యేలను కలిసే భాగ్యం లేదా?

 

డిప్యూటీ సీఎం తమ జిల్లాకు వస్తున్నారంటే స్థానిక నాయకులు కూడా ఇతర పర్యటనలు మానుకొని ఆయన్ను కలవాలని ప్రయత్నిస్తారు. కానీ ఇటీవల పవన్‌ కల్యాణ్‌ తిరుపతి జిల్లా పర్యటనలో మాత్రం ప్రజాప్రతినిధులకు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన.. నేరుగా మాముండూరు అటవీ ప్రాంతంలోని పర్యాటక కేంద్రానికి వెళ్లారు. అక్కడ అధికారుల నుంచి వివరాలు సేకరించి, వాచ్ టవర్ నుంచి పరిసరాలను పరిశీలించారు. 

అనంతరం అటవీ ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. మాముండూరు అటవీ ప్రాంతం శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి ఉపముఖ్యమంత్రిని కలిసి పలు కీలక సమస్యలను ప్రస్తావించాలని సిద్ధమయ్యారు. ముఖ్యంగా రేణిగుంట, ఏర్పేడు అటవీ ప్రాంతాల నుంచి వస్తున్న వన్యప్రాణుల దాడుల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, దీనిపై అటవీ శాఖ నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలను ఆయన దృష్టికి తీసుకురావాలనుకున్నారు. 

బాలాజీ రిజర్వాయర్ నిర్మాణం కోసం అటవీ భూముల సేకరణపై స్పష్టత లేకపోవడంతో ప్రాజెక్టు పూర్తి కావడం లేదు అనే విషయాన్ని పవన్‌కు వివరిద్దామనుకున్నారట. అంతేకాదు.. శ్రీకాళహస్తి ఆలయం సమీపంలోని కొండలపై చెట్ల పెంపకానికి అటవీ శాఖ తీసుకోవాల్సిన చర్యలపైనా ఆయనతో డిస్కస్‌ చేద్దామని రెడీ అయ్యారట. అయితే పవన్‌ వ్యక్తిగత సిబ్బంది నుంచి ఆ టూర్‌కు ఎవరూ రావాల్సిన అవసరం లేదని సమాచారం ఇచ్చారు. దాంతో బొజ్జల సుధీర్‌ రెడ్డి పవన్‌ టూర్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది.

 ఇక తిరుపతిలో జరిగిన అటవీ శాఖ రివ్యూ సమావేశానికి సైతం స్థానిక ఎమ్మెల్యేలు ఎవరికీ అవకాశం ఇవ్వలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా మంత్రులు లేదా ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించినప్పుడు ఆయా జిల్లాల ప్రజా ప్రతినిధులు హాజరై తమ నియోజకవర్గ సమస్యలను చెబుతుంటారు. కానీ, ఇక్కడ జనసేన తిరుపతి ఎమ్మెల్యేను సైతం సమావేశంలోకి రానివ్వలేదట. దీంతో ఆయన పక్క గదిలో ఉండిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తిరుమలతో పాటు తిరుపతిలో ఉన్న అటవీ శాఖ సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సిద్ధమైనా అది సాధ్యపడలేదు. 

హాస్తకళల అభివృద్ధి చైర్మన్ డాక్టర్ హారి ప్రసాద్ కూడా ఎర్రచందనాన్ని హాస్తకళల కార్పొరేషన్‌కు కేటాయించాలని విజ్ఞప్తి చేయడానికి ప్రపోజల్స్ సిద్ధం చేసుకున్నారు. కానీ, ఆయన్ని కూడా కలవడానికి అవకాశం దక్కలేదనే టాక్ ఉంది. ఇక రెండవ రోజు పర్యటనలోనూ ఇదే పరిస్థితి ఎదురైందట. పలమనేరుకు వచ్చిన ఉపముఖ్యమంత్రికి స్వాగతం పలకడానికి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ వచ్చారు. 

అయితే, రైతులతో సమావేశం అవుతారని ముందుగా చెప్పినా, డిప్యూటీ సీఎం నేరుగా మొసలిమడుగు ఏనుగుల క్యాంపుకు వచ్చి అధికారుల సమావేశంలో మాత్రమే పాల్గొన్నారు. ఏనుగుల దాడుల గురించి వివరించడానికి ఎమ్మెల్యేలు ప్రయత్నించినా ఆయన పట్టించుకోలేదనే చర్చ నడుస్తోంది. ఏనుగుల దాడులతో అల్లాడిపోతున్న తమ మాటలు కనీసం అటవీ మంత్రిగా పవన్ కల్యాణ్ వింటారని ఆశించిన రైతులకు ఈ పర్యటన నిరాశనే మిగిల్చింది. ఏనుగుల బాధితులు ఏడాదిన్నర తర్వాత తమ కష్టాలు వినడానికి మంత్రి వస్తున్నారని ఆశగా వచ్చారు. 

పంట నష్టం కొద్దిగా జరిగితే, పరిహారం అంతకంటే తక్కువగా ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలను రక్షించుకోవడానికి ఒక్కోసారి రైతులు విద్యుత్ వైర్లను వేయడం, అటవీ జంతువులు చనిపోవడంతో రైతులపై కేసులు పెడుతున్నారని వారు వాపోతున్నారు. అటవీ శాఖ లెక్కల ప్రకారమే పెద్ద ఎత్తున పంట నష్టం జరిగినట్లు చెబుతున్నా, పరిహారం విషయంలో నిర్లక్ష్యం ఉందనే విమర్శలు ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో తమ గోడు చెప్పుకుందామని వచ్చిన రైతులకు ఉపముఖ్యమంత్రిని కలిసే అవకాశం దక్కకపోవడంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. మొత్తం మీద ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనలో ఉపముఖ్యమంత్రి సమక్షంలో అధికారులకు తమ సమస్యలు వినిపించుకుందామనుకున్న రైతులకు, అధికారులకు వార్నింగ్ ఇద్దామని భావించిన స్థానిక ప్రజా ప్రతినిధులకు నిరాశ మిగిలింది. ఈ పర్యటన స్థానిక జనసేన క్యాడర్‌కు సైతం నిరాశ కలిగించిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu