అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముఖ్య అనుచరుడి దారుణ హత్య
posted on Sep 11, 2025 10:01AM

అమెరికాలో రాజకీయ హింసకు ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముఖ్య అనుచరుడు ఒకరు బలయ్యారు. ట్రంప్ అనుచరుడు, కన్జర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్ బుధవారం (సెప్టెంబర్ 10) ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఈ హత్య జరిగింది. వివరాల్లోకి వెడితే తన ఆధ్వర్యంలో పని చేసే టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ అనే యువజన సంస్థ ఓరెమ్ నగరంలోని ఉటా వ్యాలీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఒక చర్చా కార్యక్రమంలో చార్లీ కిర్క్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తి తుపాకీ హింసకు సంబంధించి ప్రశ్నలు అడుగుతుండగా, కిర్క్ సమాధానం ఇస్తున్నారు.
ఇంతలోనే ఒక్కసారిగా తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. ఒకే ఒక్క తూటా కిర్క్ మెడ ఎడమ భాగంలోకి దూసుకెళ్లడంతో ఆయన కుప్పకూలిపోయారు. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్న వారు భయంతో పరుగులు తీశారు. ఈ సంఘటనకు సంబంధించి తొలుత ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నప్పటికీ అతడు నిందితుడు కాదని తేలింది. హంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చార్లీ కిర్క్ ఒక గొప్ప వ్యక్తి, అమెరికా యువత హృదయాన్ని ఆయన అర్థం చేసుకున్నంతగా మరెవరూ చేసుకోలేరు అంటూ డోనాల్డ్ ట్రంప్ నివాళులర్పించారు.